‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా అందాల భామ రశ్మికా మందన్న చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది. కానీ, ఆమె కూత, రాత, చేత అన్నీ మోత మోగిస్తున్నాయి. కన్నడనాట విరిసిన రశ్మిక తెలుగు చిత్రసీమలో భలేగా సందడి చేస్తోంది. తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తన జిలుగు ప్రదర్శించే ప్రయత్నంలో ఉంది.
రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్. రామయ్య ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ లో సైకాలజీ, జర్నలిజమ్, ఇంగ్లిష్ లిటిరేచర్ లో డిగ్రీ చేసింది రశ్మిక. చదువు కొనే రోజుల్లోనే రశ్మిక చలాకీ తనం ఎందరినో ఆకర్షించసాగింది. రశ్మిక సైతం తన దరికి చేరిన కొత్తదనాన్ని ఆస్వాదించే ప్రయత్నంలో పరుగులు తీసేది. అలా చదువు పూర్తి కాగానే ఇలా సినిమాల్లో నటించే అవకాశం రశ్మిక తలుపు తట్టింది. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది రశ్మిక. ఈ సినిమాలో రశ్మిక నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రశ్మిక డేటింగ్ మొదలెట్టింది. ఇరువైపుల వారు వారి వివాహానికి అంగీకరించారు. దాంతో రక్షిత్, రశ్మిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే రశ్మికకు అదే సమయంలో నటిగా మంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
తెలుగులో నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో అడుగు పెట్టింది రశ్మిక. తరువాత ఆమె, విజయ్ దేవరకొండతో కలసి ‘గీత గోవిందం’లో నటించింది. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ పై ‘దేవ్ దాస్’లో నాని సరసన, ‘డియర్ కామ్రేడ్’లో మరోమారు విజయ్ తోనూ, ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబుకు జోడీగా, ‘భీష్మ’లో నితిన్ కు నాయికగా నటించిన రశ్మిక ‘పుష్ప’లో అల్లు అర్జున్ జంటగా భలే కనువిందు చేసింది. శర్వానంద్ తో రశ్మిక నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఈ యేడాది విడుదలైంది. అయితే అంతగా ఆకట్టుకోలేక పోయింది. రశ్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన ‘మిషన్ మజ్ను’లో అభినయిస్తోంది. అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న ‘గుడ్ బై’ అనే హిందీ సినిమాలోనూ రశ్మిక కీలక పాత్రలో కనిపించనుంది. అనేక సార్లు సైమా అవార్డుల్లో రశ్మిక ఉత్తమ నటిగా సందడి చేయడం విశేషం! అనతి కాలంలోనే అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటున్న రశ్మిక మునుముందు ఏ యే భాషల్లో సందడి చేస్తుందో చూడాలి.
