మన స్టార్స్ తమ వారసులుగా కొడుకులను పరిచయం చేయడానికి ఉత్సాహ పడినట్టు కూతుళ్ళను పరిచయం చేయరు. అభిమానులు నొచ్చుకుంటారేమో అనే సందేహం ఒకవైపు, ఇండస్ట్రీలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో అనే అనుమానం మరోవైపు వాళ్ళను వెనక్కి లాగుతుంటుంది. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. లేకపోతే… ఆమె ఎప్పుడో తెర మీద ఓ వెలుగు వెలిగి ఉండేది. శంకర్ ‘బాయ్స్’ మూవీ తీస్తున్నప్పుడే వరలక్ష్మీ శరత్ కుమార్ ను సంప్రదించాడు. కానీ ఇంట్లో వాళ్ళు ససేమిరా అన్నారు. ఆ తర్వాత అదే శంకర్ తాను నిర్మాతగా మారి ‘కాదల్’ మూవీని నిర్మించినప్పుడూ వరలక్ష్మీ శరత్ కుమార్ ను అప్రోచ్ అయ్యాడు.
బట్… ప్రతికూల సమాధానమే వచ్చింది. అయితే నటిగా రాణించాలనే పట్టుదల ఉన్న వరలక్ష్మీ శరత్ కుమార్ నిదానంగా తన తండ్రిని ఒప్పించింది. ముంబైలోని అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత శింబు సరసన ‘పోడా -పోడీ’తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2012లో జనం ముందుకు వచ్చింది. అంటే వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, శతాబ్ద కాలం దాటిపోయింది. ఈ పదేళ్ళలో ఆమె బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతే ఎక్కువగా వర్సిటైల్ ఆర్టిస్ట్ గా పేరును గడించింది. తమిళంలో పరిచయం అయిన రెండు సంవత్సరాలకు కన్నడ చిత్రసీమలోకి, ఆ తర్వాత రెండేళ్ళకు మలయాళ పరిశ్రమలోకి, 2019లో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
Read Also: Ippatam Tension: ఇప్పటంలో ఆందోళన విరమించిన జనసేన
గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రతినాయిక పాత్రలు!
హీరోయిన్ గా నటించే ఆర్టిస్టులకు కాలపరిమితి ఉంటుంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు, ప్రతినాయక పాత్రధారులకు ఆ సమస్య ఉండదు. కాస్తంత ఆలస్యంగా సినిమాల్లోకి వచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ కు మొదటిలో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కొన్ని సినిమా నిర్మాణం యేళ్ళ తరబడి సాగింది, మరికొన్ని సినిమాలు పూర్తి అయినా విడుదల కాకుండా ఆగిపోయాయి. అలా నిరాశాజనకంగా ఆమె కెరీర్ మొదలైనా… వెనుదిరిగి మాత్రం వరలక్ష్మీ చూడలేదు. ఆగే భడో అంటూ ముందుకే సాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే బాల దర్శకత్వంలో ఆమె నటించిన ‘తారై తప్పట్టై’ చిత్రం నటిగా గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. తీక్షణమైన వరలక్ష్మి కళ్ళను చూసి నెగెటివ్ పాత్రలు చేస్తే ఇంకా మంచి పేరొస్తుందని కొందరు దర్శకులు ఆమెకు సలహా ఇచ్చారు. వాటిని ఆచరణలో పెట్టింది. ఫలితంగా 2018లో విశాల్ ‘పందెంకోడి 2’, విజయ్ ‘సర్కార్’ చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించింది.
పాన్ ఇండియా స్టార్ గా…
వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదమయ్యాయి. అలా తెలుగువారికీ ఆమె చేరువైంది. అలా 2019లో సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ’ మూవీలో ఆమె లాయర్ గా ఓ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన రవితేజ ‘క్రాక్’ లో ఆమె పోషించిన జయమ్మ పాత్ర గొప్ప విజయాన్నే కాదు… పేరు ప్రఖ్యాతుల్నీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘నాంది’లో మరోసారి లాయర్ గా నటించింది. గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’లోనూ లాయర్ పాత్రలోనే గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… సమంత ‘యశోద’ మూవీతో వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రతినాయిక పాత్రను అత్యద్భుతంగా పోషించి మెప్పించింది వరలక్ష్మీ శరత్ కుమార్. అలానే ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించింది. ఆమె మరో కీలక పాత్ర పోషించిన పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ కూడా ఇటీవలే విడుదలైంది.
విశేషం ఏమంటే… ఆమె ప్రతినాయిక పాత్రలతో పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే కొందరు దర్శకనిర్మాతలు మహిళా ప్రధాన చిత్రాలను ఆమె తీయడానికి సాహసం చేస్తున్నారు. అలా వరలక్ష్మీ ‘శబరి’, ‘ఓం శ్రీ కనకదుర్గా’, ‘వర ఐపీఎస్’ వంటి సినిమాలలో చేస్తోంది. అలానే ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తొలి ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’లో వరలక్ష్మీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటు సినిమాల్లోనే కాకుండా అటు టెలివిజన్ షోస్ లోనూ పాల్గొంటూ తన ప్రతిభను చాటుతోంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితమైన సమయంలో బేకింగ్ రంగంలోకి అడుగుపెట్టి, కొంతమందికి తనవంతుగా ఉపాథినీ కల్పించింది. తోటి నటుడు విశాల్ తో మొదలైన ప్రేమాయణంకు ఫుల్ స్టాప్ పడకపోయినా… వారి మధ్య ప్రస్తుతం ఉన్న బంధం ఏమిటనే దానికి జవాబు లేకుండా ఉంది. మార్చి 5వ తేదీతో 39వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వర్సిటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేద్దాం.
Read Also: Maheshwar Reddy : మా మధ్య ఏం లేదు.. బాంబు పేల్చిన మహేశ్వరరెడ్డి