“బంగార్రాజు” కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. “వైల్డ్ డాగ్”లో చివరిసారిగా కనిపించిన నాగార్జున “బంగార్రాజు”లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. “మనం” తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కన్పించడం ఇది రెండోసారి. ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. 2016లో నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి “బంగార్రాజు” ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇందులో రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ప్రీక్వెల్ “బంగార్రాజు”లో నాగ చైతన్య ప్రేయసిగా కృతి శెట్టి నటించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించనున్నారు.
Read Also : గ్లింప్సె : “భీమ్లా నాయక్” బ్రేక్ టైం… మోత మోగాల్సిందే
తాజాగా ఈ సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది అనే వార్త ప్రచారం అవుతోంది. జనవరి 15న “బంగార్రాజు” విడుదల కాబోతోంది అనేది తాజా వార్త. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఈ వార్తలు నిజమైతే అక్కినేని అభిమానులకు అదే నిజమైన సంక్రాంతి అని చెప్పొచ్చు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో “బంగార్రాజు”పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పటి నుంచో అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి సెట్స్ పైకి వెళ్ళింది. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి రిలీజ్ అయ్యిందంటే అది అక్కినేని ఫ్యాన్స్ కు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అవుతుంది. కానీ ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో “బంగార్రాజు” థియేటర్లలోకి వస్తాడో రాడో చూడాలి.
ఇక నాగ చైతన్య ప్రస్తుతం బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా” సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తయిన తర్వాత చై “బంగార్రాజు” మొదలుపెడతాడు. ఇదిలా ఉండగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన “థాంక్యూ” కూడా నాగ చైతన్య చేతిలో ఉంది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్ కూడా నటించారు. సాయి పల్లవితో కలిసి నటించిన “లవ్ స్టోరీ” గ్రాండ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో మూవీ రూపొందుతోంది.