గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ మూవీ విడుదల తేదీ విషయంలో ఉన్న సస్పెన్స్ కు తెర పడింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న వార్త నిజమైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. కొంతకాలంగా తమ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే పక్కాగా విడుదల చేస్తామని, అదీ సెప్టెంబర్ మాసంలో ఉంటుందని నిర్మాతలు చెబుతూ వచ్చారు. ఇవాళ సెప్టెంబర్ 3వ తేదీ ఈ మూవీ కోసం లాక్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.
Read Also: ఈ నెలాఖరులో ‘తప్పించుకోలేరు’!
కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపీచంద్ తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా జ్వాలారెడ్డి అనే స్పోర్ట్స్ ఉమెన్ పాత్ర చేస్తోంది. భూమిక హీరో సిస్టర్ గా నటిస్తోంది. మరో యువ కథానాయిక దిగంగనా సూర్యవంశీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. మణిశర్మ స్వరపరచగా విడుదలైన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ లో సందడి చేస్తున్నాయి. అంకిత రాణాపై చిత్రీకరించిన ‘పెప్సీ ఆంటీ’ ఐటమ్ సాంగ్ యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహించారు. విశేషం ఏమంటే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో ‘గౌతమ్ నంద’ తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది!