NTV Telugu Site icon

Gollapudi Maruti Rao: గొల్లపూడి రెండు కళ్ళు.. రచన – నటన

Gollapudi

Gollapudi

రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో తొలిసారి సినిమా బాట పట్టింది.తరువాత గొల్లపూడి మాట తెలుగు సినిమాకు పలు విజయాల కోటలు కట్టింది.

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరం జిల్లా నందబలగ గ్రామంలో జన్మించారు. కన్నవారు సాహితీప్రియులు కావడంతో చిన్నతనంలోనే గొల్లపూడికీ సాహిత్యం పట్ల మక్కువ కలిగింది. పదో క్లాస్ వచ్చే సరికే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోని పలు కావ్యాలను చదివేసి జ్ఞానం పెంచేసుకున్నారు మారుతీరావు. ఆంధ్ర యూనివర్సిటీలో బి.యస్సీ, మేథమేటిక్స్, ఫిజిక్స్ చదివారు. పలు పత్రికల్లో మారుతీరావు రచనలు ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన కథలు, నాటకాలు కూడా జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. చిత్రసీమలో ప్రవేశించక మునుపు కొంతకాలం ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. ఢిల్లీలో ఆయన పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సంపాదకులు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ రైల్వేస్ లో పనచేసేవారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. ఆయన ప్రోత్సాహంతోనే గొల్లపూడి చిత్రసీమలో అడుగు పెట్టారు. మారుతీరావు ప్రోత్సాహంతో పురాణం పత్రికారంగంలో కాలు మోపారు.

చిత్రసీమలో ఆదుర్తి సుబ్బారావు వద్ద చేరారు. ఆయన దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రం తెరకెక్కించింది. కౌసల్యాదేవి రచనకు సినిమా అనుకరణ చేస్తూ గొల్లపూడి కలం సాగింది. ఆపై పలు చిత్రాలకు రచనలో చమక్కులు పలికిస్తూ సాగారు గొల్లపూడి. కె.విశ్వనాథ్ తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’కు కూడా గొల్లపూడి సంభాషణలు పలికించారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలకు గొల్లపూడి రచన ఓ దన్నుగా నిలచింది. “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, ఇల్లాలు” వంటి హిట్ రీమేక్స్ కు గొల్లపూడి రచన ఓ కళ తెచ్చింది. ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’తో నటునిగా మారిన గొల్లపూడి అభినయంతోనూ ఆకట్టుకున్నారు.

దర్శకుడు కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య -వీధిలో క్రిష్ణయ్య’తోనే గొల్లపూడి నటనాజీవితం మొదలయింది. దాంతో కోడి రామకృష్ణ తెరకెక్కించిన పలు చిత్రాలలో గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్రాలలో గొల్లపూడి ముఖ్యపాత్రలు ధరించి, ఆకట్టుకున్నారు. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో గొల్లపూడి నటన జనాన్ని మరింతగా అలరించింది. నటనలో బిజీ అయిపోయిన గొల్లపూడి సినిమా రచనకు దూరంగా జరిగారు. అయినా పత్రికల్లో ఆయన రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ‘ప్రేమపుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదంలో మరణించాడు. ఆ చిత్రం ద్వారానే నేటి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, శ్రీకర్ అన్న పేరుతో పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని గొల్లపూడి పూర్తి చేశారు. తరువాత నుంచీ తన తనయుడు శ్రీనివాస్ పేరిట ఓ స్మారక పురస్కారం ఏర్పాటు చేసి, ఉత్తమ సినీ దర్శకులకు అవార్డు ప్రదానం చేస్తూ వచ్చారు. ఓపిక ఉన్నన్ని రోజులు నటన, రచన రెండింటిలోనూ సాగారు గొల్లపూడి. 2019 డిసెంబర్ 12న గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాస విడిచారు. నేడు గొల్లపూడి లేరు. కానీ, ఆయన జ్ఞాపకాలు తెలుగువారిలో మదిలో సదా పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు.