నటశేఖర కృష్ణ చిన్న తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. అన్న నటించిన అనేక చిత్రాలకు ఆదిశేషగిరిరావు నిర్మాతగా వ్యవహరించారు. చిత్రసీమలో ఆయనను అందరూ ‘బంగారయ్య’ అని పిలుస్తుంటారు. ‘పద్మాలయా’ సంస్థను తెలుగునాటనే కాదు, ఉత్తరాదిన సైతం వెలిగేలా చేయడంలో కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఇద్దరూ కృషి చేశారు. అందుకు తగ్గ విజయం సాధించారు. చిన్నప్పటి నుంచీ అన్న కృష్ణ వెంటనే సాగిన ఆదిశేషగిరిరావు, ఈ నాటికీ అన్నను వెన్నంటే ఉండడం విశేషం!
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు 1948 ఆగస్టు 4న జన్మించారు. చిన్నతనం నుంచీ అన్న కృష్ణ వెంటే తిరిగేవారు ఆదిశేషగిరిరావు. యన్టీఆర్ నటించిన ‘జయసింహ’ చిత్రానికి వెళ్తూ తమ్ముడు ఆదిశేషగిరిరావును కూడా వెంట పెట్టుకు వెళ్ళారు కృష్ణ. అప్పట్లో చిన్నపిల్లవాడయిన శేషగిరిరావును కృష్ణ ఎంతో గారాబం చేస్తూ, సినిమా చూపించారట. ఆ విషయాన్ని ఇప్పటికీ ఆదిశేషగిరిరావు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ‘జయసింహ’ పాటల పుస్తకం వెనకాలే, యన్టీఆర్ ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ వేసి, త్వరలోనే ఆ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. యన్టీఆర్ బిజీగా ఉన్న కారణంగా ఎప్పటికప్పుడు ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. చిత్రమేమిటంటే, ఆ రోజు పాటల పుస్తకం వెనకాల యన్టీఆర్ ‘అల్లూరి’ గెటప్ చూసి మురిసిపోయిన అన్నదమ్ములు కృష్ణ, ఆదిశేషగిరిరావు తరువాతి రోజుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ను నిర్మించి అనూహ్య విజయం సాధించారు.
ఆరంభంలో కృష్ణ కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లోనూ కనిపించారు. ఆదుర్తి సుబ్బారావు ‘తేనెమనసులు’ చిత్రంతో హీరో అయ్యారు. ‘గూఢచారి 116’తో మాస్ హీరో అనిపించుకున్నారు కృష్ణ. ఆ పై అనేక చిత్రాలలో నటిస్తూ సాగారాయన. అన్న చిత్రసీమలో హీరోగా అలరిస్తున్న సమయంలోనే ఆదిశేషగిరిరావు కూడా సినిమారంగంవైపు అడుగులు వేశారు. కృష్ణ ఎన్ని సినిమాల్లో నటిస్తున్నా, భారీ విజయాలు ఆయనను వరించడంలేదు. యన్టీఆర్ ను అభిమానించే కృష్ణ సోదరులు ఆయనలాగే ఓ సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, దాని ద్వారా తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని ఆశించారు. ‘పద్మాలయా’ సంస్థను నెలకొల్పి, తొలి ప్రయత్నంగా 1970లో ‘అగ్నిపరీక్ష’ నిర్మించారు.
ఈ చిత్రానికి కృష్ణ సమర్పకులుగా, జి.ఆదిశేషగిరిరావు నిర్మాతగా వ్యవహరించారు. కె.వరప్రసాదరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయినా నిరుత్సాహ పడకుండా ముందుకు సాగారు ఆదిశేషగిరిరావు. ఆ రోజుల్లో యన్టీఆర్ మాస్ హీరోగా సాగుతూ పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. ఇక ఏయన్నార్ ప్రేమకథలతో అలరిస్తున్నారు. వారిద్దరికీ భిన్నమైన జానర్ ను ఎంచుకొని సినిమా నిర్మించాలని కృష్ణ, ఆదిశేషగిరిరావు భావించారు. తెలుగులో కౌబోయ్ మూవీ తీయాలని ఆశించారు. తత్ఫలితంగా తెరకెక్కిన చిత్రమే ‘మోసగాళ్ళకు మోసగాడు’. సాహసం చేసి 1971లోనే ఈ చిత్రాన్ని రంగుల్లో నిర్మించారు. కె.యస్.ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కృష్ణకు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు కోరుకున్నట్టుగానే మాస్ లో ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసిందీ సినిమా! ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాలో ఓ సీన్ లో ఆదిశేషగిరిరావు కూడా నటించారు. కాసేపు ఆయన తెరపై కనిపించగానే అచ్చు కృష్ణలాగే ఉన్నాడే అని ప్రేక్షకులు భావించారు.
‘మోసగాళ్ళకు మోసగాడు’ తరువాత ఆదిశేషగిరిరావు రెండో అన్న జి.హనుమంతరావు కూడా చిత్రసీమలో అడుగు పెట్టారు. అంతకు ముందు ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడంతో, ఆ పదవికి రాజీనామా చేసి వచ్చారు. ఆయన కూతురు పేరిట ‘జయప్రద పిక్చర్స్’ పతాకంపై తరువాతి చిత్రం ‘పండంటి కాపురం’ నిర్మించారు. ఆ సినిమాకు జి.హనుమంతరావు నిర్మాతగా వ్యవహరించారు. ‘పండంటి కాపురం’ ఘనవిజయం సాధించింది.
కృష్ణ కెరీర్ లో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది. తమ అభిమాన నటుడు యన్టీఆర్ తో 1973లో కృష్ణ సోదరులు ‘దేవుడు చేసిన మనుషులు’ నిర్మించారు. ఈ చిత్రం నుంచీ నిర్మాతగా జి.హనుమంతరావు, నిర్వహణ బాధ్యతలలో జి.ఆదిశేషగిరిరావు పేరు టైటిల్స్ లో కనిపించాయి. ఎప్పటిలాగే కృష్ణ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 1974లో కృష్ణ 100వ చిత్రంగా ఈ సోదరులు ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం నిర్మించారు. తెలుగులో తొలి సినిమాస్కోప్- ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ రూపొంది, అనూహ్య విజయం సాధించింది. అలా తమ అన్నతో వరుసగా నాలుగు సంవత్సరాలు చిత్రాలను నిర్మించారు కృష్ణ సోదరులు. ఆ సినిమాలతో కృష్ణకు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఆయన సినిమాలు సైతం భారీ వసూళ్ళు చూస్తూ సాగాయి.
కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’గా నటించడంతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆ చిత్రం తరువాత కృష్ణ నటించిన దాదాపు డజన్ సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ‘పద్మాలయా’ సంస్థ పతాకంపై కృష్ణ సోదరులు ‘పాడిపంటలు’ నిర్మించారు. 1976 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘పాడిపంటలు’ మంచి విజయం సాధించి, మళ్ళీ కృష్ణను మాస్ కు దగ్గరగా చేసింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి ఓ కృష్ణ చిత్రం విడుదలయ్యే సంప్రదాయం మొదలయింది. 1977లో కృష్ణ సోదరులు ‘పాండవవనవాసము’ నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులుతో కలసి ‘కురుక్షేత్రము’ అనే భారీ పౌరాణికాన్ని నిర్మించి, సంక్రాంతికి విడుదల చేశారు.
ఆపై కొన్ని చిత్రాలు పద్మాలయా సంస్థ పతాకంపై తెరకెక్కినా, అంతకు ముందు స్థాయి విజయాలను అందుకోలేదు. అయితే ఈ సోదరులు హిందీ చిత్రసీమలో పద్మాలయా పతాకంపైనే సినిమాలు తెరకెక్కించి, ఘనవిజయం సాధించారు. తెలుగులో కృష్ణ హీరోగా రూపొందిన ‘ఊరికి మొనగాడు’ చిత్రాన్ని ఈ సోదరులు హిందీలో ‘హిమ్మత్ వాలా’గా నిర్మించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతోనే శ్రీదేవి బాలీవుడ్ లో జయకేతనం ఎగురవేశారు. అలా తెలుగులో విజయం సాధించిన చిత్రాలను హిందీలో నిర్మిస్తూ విజయాలను చూశారు కృష్ణ సోదరులు.
కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ చిత్రం జానపదం. దానిని భారీగా నిర్మించారు కృష్ణ సోదరులు. తెలుగునాట తొలి 70ఎమ్.ఎమ్. సినిమాగా ‘సింహాసనం’ తెరకెక్కింది. ఈ సినిమాతోనే పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై చిత్రాలను నిర్మించ సాగారు. కొన్ని చిత్రాలకు కృష్ణ తల్లి జి.నాగరత్నమ్మ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన తమ్ముళ్ళు నిర్వహణబాధ్యతలు నిర్వహించారు. తరువాత ఆదిశేషగిరిరావు రెండో అన్న హనుమంతరావు కన్నుమూశారు. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు ఆదిశేషగిరిరావు. అదీగాక సినిమా రంగంలో మారిన పరిస్థితుల కారణంగానూ వారు చిత్రనిర్మాణం చేపట్టలేదు.
చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షునిగానూ ఆదిశేషగిరిరావు పనిచేశారు. రాజకీయాల్లోనూ అడుగు పెట్టి కాంగ్రెస్, వైసీపీ లో ఉన్నారు ఆదిశేషగిరిరావు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో తమ ‘పద్మాలయా’ సంస్థకు ఓ ప్రత్యేక గౌరవం తీసుకు రావడంలో అన్నలతో కలసి ఆదిశేషగిరిరావు తనదైన బాణీ పలికించారు. తమ సంస్థ ద్వారా తెలుగు సినిమా రంగానికి పలు సాంకేతిక సొబగులు అద్దారు. ఆదిశేషగిరిరావు మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ సాగాలని ఆశిద్దాం.