AHA: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కు లాస్ట్ వీకెండ్ ‘ఆర్ ఆర్ ఆర్’లోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు… ‘ను రాసిన చంద్రబోస్, దాన్ని ఆస్కార్ వేదికపై పాడిన గాయకుల్లో ఒకరైన రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు. వీళ్ళ రాకతో ఈ వారం సింగర్స్ అంతా ధూమ్ ధామ్ గా పాటలు పాడేశారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన చంద్రబోస్ అక్కడ నుండి తెచ్చిన నాలుగు అవార్డుల బరువును వివరంగా తొలి ఎపిసోడ్ లో చెప్పడం విశేషం.
ఆస్కార్ ప్రతిమ బరువు 3.8 కేజీలు ఉండగా, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ బరువు ఏకంగా ఆరు కేజీలు, క్రిటిక్స్ ఛాయిన్ అవార్డ్ బరువు ఏడు కేజీలు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చిన అవార్డ్ బరువు కేజీ ఉందట. ఆ రకంగా అమెరికా నుండి ఏకంగా 20 కేజీల బరువును ఇండియాకు మోసుకొచ్చానని చంద్రబోస్ సెలవిచ్చారు. ‘నాటు నాటు… ‘ పాట ‘పొలం…’ అనే పదంతో మొదలైందని చంద్రబోస్ చెబుతూ… ఆస్కార్ వేదికపై తాను ‘నమస్తే’ అని పలికినట్టు గుర్తు చేశారు. పొలం జీవన విధానం అయితే… నమస్తే జీవన సంస్కారం అని తెలిపారు. ‘నా ఐడల్ నా హీరో’ అనే ధీమ్ తో ఈ వీకెండ్ రెండు ఎపిసోడ్స్ సాగాయి. శుత్రి నండూరి ‘కొమరం పులి’లోని అమ్మ తల్లో గీతాన్ని అత్యద్భుతంగా పాడి బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంది. తమన్ ఏకంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రణతి ‘ధ్రువ’ సినిమాలోని పాట పాడింది. అలానే కార్తికేయ ‘రంగస్థలం’లోని పాట పాడాడు. ఈ సందర్భంగా కార్తికేయ ఏవీ చూసి ఆహుతులంతా అతని పెద్ద మనసుకు సెల్యూట్ చేశారు. పండగ రోజుల్లోనూ, పుట్టిన రోజు సందర్భంగానూ కార్తికేయ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కు వెళ్ళి అక్కడి వారిని తన పాటలతో ఎంటర్ టైన్ చేస్తాడని తెలిసి అభినందించారు. ఇక తమన్…. గుంటూరులో వంద మంది వృద్ధుల కోసం తాను కడుతున్న ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి కార్తికేయ రావాలని చెప్పాడు. అలానే కార్తికేయకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాట పాడే ఛాన్స్ ఈ సీజన్ అయిపోగానే కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే మర్నాటి ఎపిసోడ్ లో కార్తికేయను అభినందిస్తూ డీఎస్పీ ఓ వీడియో క్లిప్పింగ్ పంపారు. ఆ తర్వాత జయరాం, చక్రపాణి వరుసగా ‘ఓయ్’, ‘పుష్ప’ చిత్రాలలోని పాటలు పాడారు.
రెండో రోజు వైజాగ్ కు చెందిన సౌజన్య ‘నాని’ సినిమాలోని గీతాన్ని ఆలపించి బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ను అందుకుంది. సాకేత్ ‘గబ్బర్ సింగ్’లోని పాటను, ఆదిత్య ‘ఆది’లోని ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’గీతాన్ని ఆలపించారు. లాస్యప్రియ పాడిన ‘సై’లోని పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా అయిపోయి, బొమ్మ బ్లాక్ బస్టర్ ఫెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు. ఎపిసోడ్ ప్రారంభంలో చంద్రబోస్ తాను బెస్ట్ సింగర్ గా భావించిన వారికి ‘నాటు నాటు… ‘ గీతం రాసిన కలాన్ని బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చారు. అలా… ఆ పెన్ను ను సౌజన్యకు అందించారు. ఇక ఈ ఎపిసోడ్ లో స్టైలిష్ట్ పెర్ఫార్మర్ గా జయరాం గిప్ట్ హ్యాంపర్ అందుకోగా, ఖిలాడీ పెర్ఫార్మర్ గా లాస్య ప్రియ నిలిచింది.
ఎలిమినేషన్ సమయంలో జడ్జీల పాయింట్స్ ప్రకారం లాస్ట్ త్రీ కంటెస్టెంట్స్ లో ఆదిత్య, చక్రపాణి, ప్రణతి నిలిచారు. అయితే వారికి ఆడియెన్స్ ఓట్లు వచ్చిన దాని ప్రకారం కొద్దికాలంగా గొంతు నొప్పితో బాధపడుతున్న జీవీ ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడు. ఈ రెండు రోజుల ఎపిసోడ్స్ లో చంద్రబోస్ రాసిన పాటలను గాయనీ గాయకులు ఆలపించారు. చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ ఇందులో పాల్గొనడంతో ఓ కొత్త జోష్ క్రియేట్ అయ్యింది. చివరగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ చంద్రబోస్ సాంగ్స్ మెడ్లీతో అలరించారు.
Telugu Indian Idol: ‘నాటు నాటు’ సాంగ్ రాసిన పెన్ను దక్కింది ఎవరికంటే…
Show comments