8 A. M. Metro: తెలుగువారి ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవలలు దాదాపు పాతిక వరకూ సినిమాలుగా వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘అందమైన జీవితం’ కూడా చేరింది. మల్లాది రాసిన నవలల్లో మొదట సినిమాగా వచ్చింది ‘రేపటి కొడుకు’! ఆయన రాసిన ఆ నవలను ‘కువారి బహు’ పేరుతో కుమార్ వాసుదేవ్ హిందీలో సినిమాగా తీశారు. సారిక, విజయేంద్ర, నవీన్ నిశ్చల్, తనుజా, అరుణా ఇరానీ తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఆ సినిమా 1984 జూలై 10న విడుదలైంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మల్లాది రాసిన మరో నవల ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాగా వచ్చింది. తెలుగులో అయితే మల్లాది రాసిన నవలల ఆధారంగా, ”శ్రీవారి శోభనం, చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, డబ్బెవరికి చేదు, నీకు నాకు పెళ్ళంట, ఝాన్సీరాణి, గోల్ మాల్ గోవిందం, రేపటి కొడుకు, లక్కీ ఛాన్స్, విచిత్రం, ష్ గప్ చుప్, ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్, జ్యోతిలక్ష్మీ, వెన్నెల్లో హాయ్ హాయ్” వంటి ఇరవై కు పైగా సినిమాలు వచ్చాయి. అంతేకాదు మల్లాది నవలలతో కన్నడలోనూ రెండు, మూడు సినిమాలు వచ్చాయి.
‘మల్లేశం’ బయోపిక్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండకు ‘అందమైన జీవితం’ నవలలోని ప్రధానాంశం నచ్చడంతో దాన్ని ‘8 ఎ.ఎం. మెట్రో’ పేరుతో తెరకెక్కించారు. హైదరాబాద్ లోకల్ ట్రైన్ నేపథ్యంలో మల్లాది ఆ నవలను 1989 రాయగా, ఈ టైమ్ కు తగ్గట్టు మెట్రో ట్రైన్ బ్యాక్ డ్రాప్ లో రాజ్ దీన్ని మార్చి తీశారు. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో సయామీ ఖేర్, కల్పిక తెలుగువాళ్ళకు సుపరిచితులే!
ట్రైన్ జర్నీ అంటే భయపడే ఓ సాధారణ మధ్య తరగతి గృహిణి ఇరావతి నాందేడ్ నుండి తన చెల్లెలి డెలివరీ కోసం ఒంటరిగా హైదరాబాద్ కు వస్తుంది. ఇక్కడ ఇంటి నుండి హాస్పిటల్ కు మెట్రోలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆమెకు ప్రీతమ్ పరిచయం అవుతాడు. రెండు, మూడు వారాల వ్యవథిలో వారి మధ్య ఏర్పడిన స్నేహం, పంచుకున్న భావాలు, బలపడిన అనుబంధాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ కథాంశం నచ్చి ప్రఖ్యాత గీత రచయిత, దర్శకుడు గుల్జార్ దీని కోసం కవితలు అందించారు. అలానే మూవీ పోస్టర్ నూ విడుదల చేశారు. ఈ నెల 19 నుండి ‘8 ఎ. ఎం. మెట్రో’ మూవీ సెలెక్టెడ్ థియేటర్లలో పరిమిత సంఖ్యలో ప్రదర్శితమౌతోంది. ఇలాంటి సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం ఫూలిష్ నెస్ అని ప్రధాన పాత్రధారి గుల్షన్ దేవయ్య వాపోయినా, థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం సినిమాను చూస్తున్న వాళ్ళు లేకపోలేదు! నటీనటుల సహజ నటన, సాంకేతిక నిపుణుల పనితనానికి వారంతా ఫిదా అవుతున్నారు.
నవల పేరైన ‘అందమైన జీవితం’కు తగ్గట్టుగానే ఓ అందమైన అనుభూతిని రాజ్ రాచకొండ తన ‘8 ఎ. ఎం. మెట్రో’ ద్వారా అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు థియేటర్లలో సినిమాను చూడలేని వారు ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడైనా చూస్తే బాగుంటుంది! అర్థవంతమైన చిత్రాలను అందించాలనే రాజ్ రాచకొండ సంకల్పానికి దన్నుగా నిలిచిన వారు అవుతారు! మల్లాది రాసిన మరిన్ని నవలలు వెండితెరపైకి రావడానికి కారకులవుతారు!