మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై RT టీమ్ వర్క్స్ సహకారంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్.. బుల్బుల్ తరంగ్ అంటూ సాగే ఈ ప్రేమ పాటను ఏప్రిల్ 10 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలుపుతూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక పోస్టర్ లో రవితేజ, రజిషా ఇద్దరూ రొమాంటిక్ గా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. లంగా ఓణిలో రజిషా ఎంతో అందంగా కనిపించగా.. రవితేజ సైతం హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ కలెక్టర్ రామారావు గా నటిస్తున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో మాస మహారాజా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
