విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమా ఈ రోజు (ఫిబ్రవరి 11న) విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే కొందరు సినిమాపై వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత భావాలను చిత్ర యూనిట్ ఖండించింది. ”మా ‘ఎఫ్.ఐ.ఆర్.’ ఏ మతస్థులను కించపరిచేట్లు తీయలేదు. ప్రతి భారతీయుడు గర్వపడేలా తీసిన సినిమా ఇది. కానీ, ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా వుందని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాను ఆపేయడం జరిగింది. కానీ సినిమాను చూసిన ప్రముఖులు కానీ, ప్రేక్షకులు కానీ ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా లేదని తెలియజేశారు. ఇది కేరళలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తీసిన సినిమా మాత్రమే. మీ మనోభావాలు దెబ్బతిన్నట్లు అనిపిస్తే మా తరఫున ముస్లిం సోదరులకు క్షమాపణలు తెలుపుతున్నాం” అని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలియజేసింది.