ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పైరసీ, టికెట్ రేట్ల సమస్యలతో పాటు సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాల గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొంతమంది పొల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ ఫెయిల్ అయ్యింది. దాన్ని అరికట్టడంలో మరింత కృషి చేయాలి. నిర్మాతల మండలి కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. సినిమా టికెట్ రేట్లపై ఎవరిష్టం వచ్చి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్స్ పెంచడం మంచిది కాదని దిల్‌రాజు ఇప్పుడు చెప్తున్నాడు. టికెట్ రేట్స్ పెంచమని ప్రభుత్వాలని అడిగేటప్పుడు, ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండాలని అడిగితే బావుండేది. అలా చేసి ఉంటే, సమస్యలు వచ్చేవి కావు. డిమాండ్‌కు తగ్గట్టే రేట్లు కేటాయించాలి. గతంలో లాగా అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి’’ అని అన్నారు.
ఓటీటీలపై మొదట్నుంచీ సెన్సార్ లేదని చెప్పిన ఆదిశేషగిరి రావు.. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించాలన్నారు. సోషల్ మీడియాలో అయితే సినిమాపై ట్రోలింగ్ చాలా ఎక్కువైందన్నారు. సోషల్ మీడియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కంటెంట్ మీద విమర్శించడం మంచిదే కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ కూడా.. సోషల్ మీడియా వార్తలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. సెలెబ్రిటీలు కూడా మనుషులేనని, వారికీ కుటుంబాలుంటాయని, కేవలం వ్యూస్ కోసం నెగెటివ్ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఇక మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మీడియా అనేది అత్యవసరం. సోషల్ మీడియా మాత్రం అవాస్తవాల అడ్డాగా మారింది. ఎంతో కష్టపడి పేరు, గౌరవం పొందిన వారిపై అసభ్యంగా వార్తలు వేస్తున్నారు. శ్రీకాంత్ ,శారద, కవిత చనిపోయినట్లు తప్పుడు వార్తలు రాశారు. మా అధ్యక్షుడు విష్ణు గురించి కూడా చులకనగా ప్రచారం చేశారు. రాంగ్ థంబ్ నెయిల్స్ ఇకనైనా మారాలి. దీనిపై చిత్ర పరిశ్రమ ఏకమై ఖండిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.
