దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మే 13తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. తొలి నుంచీ భారీ అంచనాలతో అందరినీ ఊరిస్తూ వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మార్చి 25న జనం ముందు నిలచింది. మొదటి నుంచీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో ఈ యేడాది తెలుగులో భారీ వసూళ్లు చూసిన చిత్రంగా నిలచింది ‘ట్రిపుల్ ఆర్’. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ఐదు కోట్ల రూపాయలు పోగేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో ఈ చిత్రం అర్ధశతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం విడుదలయ్యాక కొన్ని భారీ చిత్రాలు రావడంతో సినిమాను కొన్ని కేంద్రాలలో షిఫ్ట్ చేయవలసి వచ్చింది. 48 రోజుల వరకు ఈ చిత్రం తెలుగునేలపై 24 కేంద్రాలలో డైరెక్ట్ గా ప్రదర్శితమయింది. మే 12న మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ విడుదల కావడంతో అనేక కేంద్రాల్లో ‘ట్రపుల్ ఆర్’ను తీసివేశారు. దాంతో కేవలం 8 కేంద్రాలలోనే ‘ట్రిపుల్ ఆర్’ డైరెక్ట్ గా యాభై రోజులు సాగింది.
హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో కూడా 48 రోజులకు షిఫ్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ‘సర్కారు వారి పాట’ చిత్రం పర్మినెంట్ థియేటర్ గా ముందు సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.నే ఎంచుకున్నారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ చూసిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం నైజామ్ లో కనీసం యాభై రోజులు నేరుగా ఆడలేదంటే బాగోదని ఫ్యాన్స్ భావించారు. వారి అభిప్రాయాన్ని పంపిణీదారులు, థియేటర్ వారు సైతం గౌరవించారు. అందువల్ల మే 12న సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో ‘సర్కారు వారి పాట’ను కేవలం రెండు ఆటలకే పరిమితం చేసి, ‘ట్రిపుల్ ఆర్’ను మూడు ఆటలు ప్రదర్శించారు. అలా ఆ థియేటర్ లో 48 రోజులు 4 ఆటలతో సాగిన ‘ట్రపుల్ ఆర్’ రెండు రోజులు మూడు ఆటలతో నడిచింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘ట్రిపుల్ ఆర్’ను 51వ రోజు నుంచీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎమ్.ఎమ్.లో ప్రదర్శించనున్నారు. ఇతర కేంద్రాలలో పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ప్యాండమిక్ తరువాత హైదరాబాద్ లో అదీ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్. లోనే డైరెక్ట్ గా యాభై రోజులు ఆడిన తొలి చిత్రంగా బాలకృష్ణ ‘అఖండ’ నిలచింది. ఆ సినిమా 54 రోజులు 4 ఆటలతో అర్ధశతదినోత్సవం చూసింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ ఆ బాటలోనే సాగింది. ‘అఖండ’ 50వ రోజున డైరెక్ట్ గా 24 కేంద్రాలలో ప్రదర్శతమయింది. ఆ రోజున మొత్తం 160కి పైగా స్క్రీన్స్ లో సందడి చేసింది. 8 కేంద్రాలలో డైరెక్ట్ గా అర్ధశతదినోత్సవం చూసిన ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా 50వ రోజున 200పైగా స్క్రీన్స్ లో ప్రదర్శితమయింది.