బాలీవుడ్ లో పెళ్ళిళ్ళ హంగామా జోరుగా సాగుతోంది. ఇటీవలే నటి మౌనీరాయ్ ప్రేమ వివాహం చేసుకోగా, ఈ నెల 21న ప్రముఖ దర్శక నటుడు ఫర్హాన్ అక్తర్ సైతం మరోసారి పెళ్ళి బాట పడుతున్నాడు. గతంలో తాను దర్శకత్వం వహించిన ‘దిల్ చాహ్ తా హై’ హెయిర్ స్టైలిస్ట్ అధునా భవానిని ఫర్హాన్ 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మూడేళ్ళ డేటింగ్ తర్వాత జరిగిన ఈ పెళ్ళి 16 సంవత్సరాల తర్వాత విడాకులకు దారితీసింది. 2016లో తాము విడిపోతున్నామని తెలిపిన ఈ జంట, 2017 లో విడాకులు తీసుకుంది.
Read Also : హీరోయిన్ పుట్టుమచ్చల వివాదం… ‘డీజే టిల్లు’ రియాక్షన్
ఆ తర్వాత డినో మోరియో అన్నయ్య నికోలోతో అధునా భవానీ డేటింగ్ చేస్తుంటే… మూడేళ్ళ క్రితం ఫర్హాన్ అక్తర్ వీజే శిబానీ దండేకర్ తో ప్రేమలో పడ్డాడు. అయితే ఇప్పుడీ జంట వివాహం చేసుకోబోతున్నట్టు ఫర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ తెలిపాడు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వివాహాన్ని నిరాడంబరంగా చేస్తామని, 21వ తేదీ వధూవరులిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారని, ఆ తర్వాత సన్నిహితుల సమక్షంలో ఖండాలాలో చిన్నపాటి ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని జావేద్ అక్తర్ తెలిపాడు. విజేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శిబానీ ఇప్పటికే పలు మరాఠీ, హిందీ చిత్రాలలో నటించింది. అలానే తమన్నా టైటిల్ రోల్ ప్లే చేసిన తెలుగు సినిమా ‘దటీజ్ మహాలక్ష్మీ’లో శిబానీ ఓ కీలక పాత్ర పోషించింది.