NTV Telugu Site icon

మాటల వారధి… త్రిపురనేని మహారథి!

Movie

Movie

రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం ఉంటుందని త్రిపురనేని మహారథి ఆ రోజుల్లోనే చాటి చెప్పి, అదే తీరున రచనలు సాగించారు. అందువల్లే ఎంతోమంది తరువాతి తరం రచయితలు ఆయన బాణీని అనుసరిస్తూ సాగారు. తెలుగు చిత్రసీమలో మరపురాని చిత్రాల్లో ఒకటిగా నిలచిన చారిత్రక చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ మహారథి రచనలోనే రూపొందింది. ఈ నాటికీ ఆ సినిమా చూస్తే ఆకట్టుకొనేలాగే ఉంటుంది. అదీ మహారథి రచనలోని మహత్తు!

త్రిపురనేని మహారథి 1930 ఏప్రిల్ 20 కృష్ణాజిల్లా పసుమర్రులో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహారథికి చిన్నతనం నుంచీ చదువంటే ఎంతో అభిమానం. ఆయన చిన్నతనంలో తల్లి పుణ్యవతి తనకు తెలిసిన పుక్కిటి పురాణాలు చెప్పేవారు. తండ్రి సత్యనారాయణ రామాయణ, భారతగాథలు వినిపించేవారు. మహారథికి అక్షరజ్ఞానం వచ్చిన తరువాత ఇతరులపై ఆధారపడకుండా తనకు కనిపించిన ప్రతీ అంశాన్నీ చదివేవారు. అయితే తండ్రి మరణంతో మహారథి చదువు అటకెక్కింది. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం వ్యవసాయం చేశారు. ఇక చేసేది లేక హైదరాబాద్ వచ్చి ఓ కంపెనీలో గుమాస్తాగా ఉద్యోగం ఉన్నారు. ఆపై ‘మీజాన్’ పత్రికలో సబ్ ఎడిటర్ గానూ పనిచేశారు. భూపోరాటంలో చురుగ్గా పాల్గొనడం వల్ల మహారథి పేరు పోలీసు రికార్డుల్లోనూ ఎక్కింది. దాంతో తెలిసిన వారి సలహామేరకు చిత్రసీమలో ప్రవేశించి, ‘పాలేరు’ అనే సినిమాకు ప్రొడక్షన్ వ్యవహరాలు చూశారు. అదీ వెలుగు చూడలేదు. కె.బి.తిలక్ వద్ద ‘ఎమ్.ఎల్.ఏ’ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేశారు. కొన్ని చిత్రాల రచనలో పాలు పంచుకుంటూ పబ్బం గడుపుకునేవారు. ఆ సమయంలో ‘శివగంగ సీమై’ అనే చిత్రాన్ని తెలుగులో ‘యోధానయోధులు’గా అనువదించారు. దానికి మాటలు రాశారు. అప్పుడే టైటిల్స్ లో తన పేరు చూసుకున్నారు మహారథి.

మహారథి కలం బలం తెలిసిన దర్శకుడు వి.మధుసూదనరావు తనతో కొంతకాలం తిప్పుకున్నారు. అలా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘రక్తసంబంధం’ చిత్రంకు పనిచేశారు. ఆ సినిమా ద్వారానే ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా ప్రవేశించారు. అదే సంస్థ యన్టీఆర్ తోనే తెరకెక్కించిన ‘బందిపోటు’ సినిమాతో మహారథికి మంచి పేరు లభించింది. ఆ పై యన్టీఆర్ సమీపబంధువైన యు.విశ్వేశ్వరరావుతో స్నేహం కుదిరింది. ఆయన తెరకెక్కించిన “కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు” చిత్రాలకు మహారథి రచన చేసి విశేషమైన గుర్తింపు సంపాదించారు. యన్టీఆర్ తో కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’కు మహారథి రచన దన్నుగా నిలచింది. దాంతో ఆ తరువాత కృష్ణ నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’కు కథ, మాటలు మహారథి సమకూర్చారు. ఆ సినిమాతో మహారథికి ఎక్కడలేని పేరు లభించింది. కృష్ణ సినిమాలకే వరుసగా మాటలు పలికిస్తూ సాగడంతో ఇతర చిత్రాల అవకాశాలు సన్నగిల్లాయి. అయినా తనదరికి చేరిన చిత్రాలకు తనదైన పంథాలో మాటలు పలికించారు మహారథి.

“దేశమంటే మనుషులోయ్, భోగిమంటలు, రైతు భారతం” వంటి చిత్రాల నిర్మాణంలోనూ మహారథి పాలు పంచుకున్నారు. ఆయన తనయుడు త్రిపురనేని ప్రసాద్ కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. మహారథికి యన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన సమయంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదం గురించి మహారథి కూడా తన రచనల్లో చొప్పించారు. రాజకీయాలపై కూడా మహారథికి ఎంతో అవగాహన ఉండేది. అందువల్ల సినిమాల్లో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ భలేగా పలికించేవారు. ఆయన తనయుడు త్రిపురనేని ప్రసాద్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 2011 డిసెంబర్ 23న త్రిపురనేని మహారథి కన్నుమూశారు. ఆయన పెన్నుమూసినా, ఆ కలం పలికించిన పలు సంభాషణలు ఈ నాటికీ జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి.