మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలను బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం మాలీవుడ్ ని షేక్ చేస్తోంది. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి పేరు ఉంది. మహానటి, కనులు కనులను దోచాయంటే, కురుప్ లాంటి చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. అంతేకాకుండా అతడు నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(ఎఫ్‌ఈయూకే) నిర్ణయించాలని చూడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే.. దుల్కర్ ప్రస్తుతం సెల్యూట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే.
రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇటీవలే ఓటిటీ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొన్నటివరకు థియేటర్ రిలీజ్ అని చెప్పి .. ఇప్పుడు సడెన్ గా ఓటిటీ లో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించడంతో ఎఫ్‌ఈయూకే మండిపడుతుంది. ఓటిటీ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న దుల్కర్ సినిమాలను బ్యాన్ చేయాలంటూ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తలపై ఇప్పటివరకు దుల్కర్ స్పందించకపోవడం విశేషం.. ఇక ఇలాటి సంఘటనే కోలీవుడ్ లో సూర్యకు ఎదురైంది. జై భీమ్ సినిమాను డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ చేస్తున్నాడని ఎగ్జిబిటర్స్ సూర్య సినిమాలను బ్యాన్ చేయాలని అప్పట్లో హల్చల్ చేసిన సంగతి తెల్సిందే.. మరి ఈ వివాదంపై స్టార్ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.
