Site icon NTV Telugu

Tollywood: ఈ వారం డబ్బింగ్ సినిమాలదే సందడి!

Ps 1

Ps 1

Tollywood: సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రతి వీకెండ్ ఆరేడు సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఆ జోరుతో పోల్చితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ తెలుగు సినిమాల సందడి కాస్తంత తగ్గబోతోంది. ఎందుకంటే ఈ వారంలో రెండు పెద్ద తమిళ అనువాద చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో మొదటిది ‘నేనే వస్తున్నా’. ధనుష్‌ హీరోగా అతని అన్నయ్య సెల్వరాఘవన్ తెరకెక్కించిన సినిమా ‘నానే వరువెన్’. దీనిని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో డబ్ చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఇది గురువారం జనం ముందుకు వస్తోంది. కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తుండటం విశేషం.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ సైతం ఈ శుక్రవారం విడుదల అవుతోంది. విక్రమ్, కార్తి, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. చోళ రాజుల కథను వెండితెరపై ఆవిష్కరించాలన్నది మణిరత్నం చిరకాల వాంఛ. రెండు భాగాలుగా రూపుదిద్దుకోనున్న ‘పొన్నియన్ సెల్వన్’లో మొదటి భాగాన్ని శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. దీనిని తమిళంలోనే కాకుండా వివిధ భారతీయ భాషల్లోనూ డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో జనం ముందుకు మణిరత్నం తెస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘దిల్’ రాజు పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు పెద్ద సినిమాలే ఈ వారం సింహభాగం థియేటర్లను ఆక్యుపై చేసుకుంటున్నాయి. ఇక చిన్న చిత్రాలు ‘నేను కేరాఫ్‌ నువ్వు’, ‘లాట్స్ ఆఫ్ లవ్‌’ శుక్రవారం వస్తుంటే, ‘బలమెవ్వడు’ సినిమా అక్టోబర్ 1, శనివారం నాడు థియేటర్లలో విడుదల కాబోతోంది.

Exit mobile version