లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన చిత్రాలలో ‘డీజే టిల్లు’ది పై చేయిగా నిలిచింది. అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చింది. అయితే ఈ వాయిదాల పర్వం ‘డీజే టిల్లు’కు కలిసి వచ్చిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ‘ఖిలాడీ’ చిత్రంతో సహా మరే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ‘డిజే టిల్లు’ యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఆ మూవీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పనిలో పనిగా మూవీ హీరో, హీరోయిన్, డైరెక్టర్ కూడా సక్సెస్ టూర్ చేస్తున్నారు.
Read Also : Deep Sidhu : యాక్సిడెంట్… రైతు నిరసనతో వార్తల్లో నిలిచిన నటుడి మృతి
ఇదిలా ఉంటే… ‘డీజే టిల్లు’కు సంబంధించిన ఓ సెంటిమెంట్ ను ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘వర్జీన్ స్టోరీ’కి వర్తింప చేశారు నిర్మాతలు లగడపాటి శిరీషా, శ్రీధర్ దంపతులు. అదేంటంటే… ‘డీజే టిల్లు’కు మొదట అనుకున్న టైటిల్ ‘నరుడి బ్రతుకు నటన’. అదే పేరుతో సినిమా ఓపెనింగ్ జరిగింది. చాలా వరకూ ప్రచారమూ సాగింది. టైటిల్ లోగోనూ జనంలోకి దర్శక నిర్మాతలు వదిలారు. అయితే ఆ టైటిల్ వేరే వారి వద్ద ఉన్న కారణం కావచ్చు లేదా మరీ క్లాస్ గా ఉందనే భావనతో కావచ్చు… మూవీ విడుదలకు కొన్ని నెలల ముందు హీరో క్యారెక్టరైజేషన్ ను బేస్ చేసుకుని ‘డీజే టిల్లు’ అని మార్చారు. సరిగ్గా ఇదే ‘వర్జిన్ స్టోరీ’ మూవీ విషయంలోనూ జరిగింది. లగడపాటి శ్రీధర్ తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ తో తీసిన ఈ చిత్రానికి మొదట ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అనే టైటిల్ పెట్టారు. గత యేడాది ఆ టైటిల్ లోగోను ‘ఉప్పెన’ టీమ్ తో ఆవిష్కరింప చేశారు. అయితే… ఆ పేరు మరీ క్లాస్ గా ఉందని, యూత్ ను ఆ టైటిల్ తో అట్రాక్ట్ చేయడం కష్టమని భావించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ‘వర్జిన్ స్టోరీ’గా మార్చారు. మరి పేరు మార్పు ‘డీజే టిల్లు’ విజయానికి దోహద పడినట్టే… శుక్రవారం విడుదల కాబోతున్న ‘వర్జిన్ స్టోరీ’కీ సెంటిమెంట్ గా మారి ఉపయోగపడుతుందేమో చూడాలి.