Site icon NTV Telugu

‘భీమ్లా నాయక్’ కాదు వస్తోంది ‘డిజె టిల్లు’!

dj tillu

dj tillu

మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగబోతున్న ఇతర చిత్రాల మీదకు అందరి దృష్టి మళ్ళింది. పనిలో పనిగా ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటించిన కొందరు నిర్మాతలు తమ చిత్రాల అప్ డేట్స్ ను ఇవ్వడం కూడా మొదలెట్టారు. ‘ట్రిపుల్ ఆర్’ వాయిదాతో ముందు అనుకున్న విధంగా ‘భీమ్లా నాయక్’ను జనవరి 12న విడుదల చేస్తారేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్’ మూవీ సంక్రాంతి బరిలో దిగదు అనేది కన్ ఫామ్ అయిపోయింది. ఎందుకుంటే…. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తాను నిర్మించిన’డిజె టిల్లు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించాడు. పీడీవి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ కొత్తతరం ప్రేమకథా చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల తేదీ ప్రకటనతో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ యూత్ ను అట్రాక్ట్ చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తోంది. గతంలో ఈ సినిమాకు ‘నరుడి బ్రతుకు నటన’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు యువతను దృష్టిలో పెట్టుకుని పేరును ‘డిజె టిల్లు’గా మార్చారు. మొత్తానికి ఈ యంగ్ హీరో మూవీ సంక్రాంతి సీజన్ లో రావడం అంటే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే!

Exit mobile version