Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Operation Sindoor (2)

Operation Sindoor (2)

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా రూపొందిన ప్రత్యేక డాక్యుమెంటరీని డిస్కవరీ అధికారికంగా ప్రకటించింది. ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ పేరుతో రూపొందిన ఈ రెండు భాగాల డాక్యుమెంటరీ ఆగస్టు 15న రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్కవరీ ఛానల్‌ లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన చర్యల వెనుక ఉన్న వ్యూహాలు, ప్రణాళికలను విపులంగా చూపించనున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నుంచి మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ అమలు వరకు జరిగిన కీలక పరిణామాలను ఇందులో ఆవిష్కరించనున్నారు. నిర్మాతలు పంచుకున్న వివరాల ప్రకారం, ఈ సిరీస్‌లో భారత సైనిక నాయకత్వ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో పాల్గొన్న అధికారులు, ప్రముఖ జర్నలిస్టుల అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా 88 గంటల సైనిక ఆపరేషన్ ఎలా ప్రణాళికాబద్ధంగా అమలైందో, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక ఆలోచనలు, కీలక నిర్ణయాలను ప్రేక్షకులకు చేరవేయనున్నారు.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దక్షిణాసియా ఫ్యాక్చువల్ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారి సాయి అభిషేక్ మాట్లాడుతూ, ఈ డాక్యుమెంటరీతో తమ కొత్త ‘డీక్లాసిఫైడ్’ ఫ్రాంచైజీకి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. చరిత్రను మలుపుతిప్పిన కీలక సంఘటనలను విశ్వసనీయ సమాచారంతో ప్రేక్షకులకు అందించడం ఈ ఫ్రాంచైజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. భారత సాయుధ దళాల మూడు విభాగాలకు చెందిన ప్రతినిధులు, ఆపరేషన్‌కు అత్యంత సమీపంగా పనిచేసిన కమాండోల అనుభవాలను ఇందులో పొందుపరచడం తమకు గౌరవంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని అత్యంత బాధ్యతతో రూపొందించినట్లు వెల్లడించారు. బయటకు తెలిసిన వివరాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న సైనిక వ్యూహాలు, ప్రణాళిక, నిర్ణయాలు, మిషన్‌లో పాల్గొన్న సిబ్బంది అనుభవాలను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

పహల్గామ్ ఉగ్రదాడి అనేది 22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) జరిపిన అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన. ఈ ఉగ్రదాడిలో 26 మంది హిందూ, క్రిస్టియన్ పర్యాటకులతో పాటు ఒక ముస్లిం గైడ్ దుర్మరణం పాలయ్యారు. ఇది 2008 ముంబై దాడుల తర్వాత పౌరులపై జరిగిన అతిపెద్ద దాడిగా నమోదైంది. దీనికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించి కీలక ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఉగ్రదాడి జరిగి ఏడాది దాటినప్పటికీ పహల్గామ్ పర్యాటక రంగం ఇంకా కోలుకోలేదు. దీనికితోడు నిన్న రాత్రి (31 జూలై 2026) కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన తాజా కాల్పుల్లో ఒకరు మరణించడంతో కాశ్మీర్ లోయలో మళ్లీ తీవ్ర భద్రతా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఆగస్టు 15న చూపించబోయే ఈ డాక్యుమెంటరీతో ప్రజలకు తెలియని మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.