Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!

Director Ravi

Director Ravi

Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా, దర్శకుడు రవి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన సినీ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపి.. “నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది వారి ఆశీర్వాదమే” అని అన్నారు. అలాగే తన గురువు దర్శకుడు మారుతిని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ.. “మీరు ఒకరోజు నేను డైరెక్టర్ అవుతానని నమ్మకం కల్పించకపోయి ఉంటే, ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు” అంటూ ఎమోషనల్ అయ్యారు.

తన సినీ ప్రయాణంలో ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన స్నేహితులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన టీమ్ సభ్యుల సహకారం ఈ సినిమా పూర్తి చేయడంలో కీలకమైందన్నారు. నిర్మాతలు రాజేష్, సాయి రాజేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని జీవితాంతం మరిచిపోలేనని రవి చెప్పారు. “100 రోజుల పాటు ఓ కొత్త దర్శకుడిని నమ్మి సినిమా నిర్మించడం చాలా గొప్ప విషయం” అంటూ వారి సహకారాన్ని కొనియాడారు. అలాగే సంగీత దర్శకుడు మణిశర్మ, గేయ రచయిత అనంత శ్రీరామ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. “ఒక్క క్షణం కూడా నన్ను అనుమానించలేదు. కొత్త దర్శకుడినైనా పూర్తిగా నమ్మి నాకు అండగా నిలిచాడు. నా జీవితంలో ఎప్పటికీ ఆయన నా తొలి హీరోగానే ఉంటారు” అని అన్నారు. హీరోయిన్ గౌరీ నటన గురించి మాట్లాడుతూ.. “సెకండ్ హాఫ్‌లో ఆమె నటించిన ఓ సన్నివేశం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఆ సీన్ తర్వాత చాలా రోజులు ఆమె గురించే మాట్లాడుకుంటారు” అని వెల్లడించారు. చివరగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి రవి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నప్పటి నుంచి తనకు చిరంజీవి అంటే అభిమానమని, ఈరోజు తన సినిమా ఈవెంట్‌కు ఆయన రావడం జీవితంలో మరచిపోలేని క్షణమని చెప్పారు. “మా అమ్మ ఒకప్పుడు చిరంజీవి నీకు కూడు పెడతాడా అనేది. కానీ ఇప్పుడు ఆయన మా ఈవెంట్‌కు రావడంతో సినిమా కలెక్షన్లు రెట్టింపు అవుతాయి. ఆ విధంగా ఆయన నిజంగానే నాకు కూడు పెడుతున్నారు” అంటూ సరదాగా చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. మొత్తంగా తన 10 ఏళ్ల కష్టానికి ఈ సినిమానే సమాధానం అని అన్నారు. డైరెక్టర్ రవి చేసిన ఈ ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.