Krish Jagarlamudi: దర్శకుడు క్రిష్ పేరు వింటే చాలు ఆయన తెరకెక్కించిన వైవిధ్యమైన చిత్రాలు మన మదిలో చిందులు వేస్తాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కిస్తున్నారు. జానపద చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ ఆశయాలు కూడా పొందుపరిచారని తెలుస్తోంది. దీంతో ఆ సినిమాపై పవన్ ఫ్యాన్స్ మరింత ఆసక్తి నెలకొంది.
క్రిష్ అసలు పేరు జాగర్లమూడి రాధాకృష్ణ. ఆయన 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం అక్కడే పనిచేశారు. అమెరికాలో ఉన్న సమయంలోనే క్రిష్ మనసు సినిమాలవైపు మళ్ళింది. సినిమా టెక్నిక్ ను అధ్యయనం చేశారు క్రిష్. స్వదేశం వచ్చిన తరువాత అల్లరి నరేశ్, శర్వానంద్ హీరోలుగా ‘గమ్యం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. ‘గమ్యం’తోనే దర్శకునిగా మంచి పేరు లభించింది. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “వేదం, కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రాలు సైతం జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ‘వేదం’ చిత్రాన్ని తమిళంలో ‘వానమ్’ పేరుతో క్రిష్ తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘రమణ’ ఆధారంగా తెలుగులో చిరంజీవి ‘ఠాగూర్’ రూపొందింది. ఇదే కథను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ పేరుతో క్రిష్ రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మించడం విశేషం. తరువాత రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘కంచె’ అనే సినిమా రూపొందించారు క్రిష్. ఈ చిత్రాలన్నీ క్రిష్ కు దర్శకునిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. అయితే క్రిష్ కు బాక్సాఫీస్ బంపర్ హిట్ ను మాత్రం చారిత్రక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అందించింది. బాలకృష్ణ నూరవ చిత్రంగా రూపొందిన ‘గౌతీమీపుత్ర శాతకర్ణి’ కమర్షియల్ సక్సెస్ తో పాటు పేరు కూడా సంపాదించి పెట్టింది.
హిందీలో ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’కి దర్శకత్వం వహించారు క్రిష్. కొంత భాగం ఉండగానే, కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం నుండి తప్పుకున్నారు. మిగతా భాగాన్ని చిత్ర కథానాయిక కంగనా రనౌత్ పూర్తిచేశారు. యన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన “కథానాయకుడు, మహానాయకుడు” రెండు భాగాలను క్రిష్ రూపొందించారు. బాలకృష్ణ సొంతగా నిర్మించిన ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. రాయలసీమ జీవనవిధానం నేపథ్యంగా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను అదే పేరుతో చిత్రంగా రూపొందించారు క్రిష్. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ‘కొండపొలం’ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది.
క్రిష్ తన చిత్రాలలో అతిథి పాత్రల్లో కనిపించి అలరిస్తుంటారు. తొలి చిత్రం ‘గమ్యం’లో నక్సలైట్ గా కనిపించిన క్రిష్, తరువాత తన ‘వేదం’, ‘వానం’ చిత్రాల్లో సాధువుగా నటించారు. నాగ్ అశ్విన్ రూపొందించిన ‘మహానటి’లో కేవీ రెడ్డి పాత్రలో కనిపించారు. తన ‘యన్టీఆర్ కథానాయకుడు’లోనూ కేవీ రెడ్డిగా దర్శనమిచ్చారు. తొలి చిత్రం ‘గమ్యం’తోనే ఉత్తమ దర్శకునిగా నంది అవార్డును సంపాదించారు క్రిష్. ఆయన తెరకెక్కించిన ‘కంచె’కు జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు లభించింది. రాబోయే ‘హరి హర వీరమల్లు’పై పవన్ ఫ్యాన్స్ తో పాటు క్రిష్ ను అభిమానించేవారూ ఆశలు పెట్టుకున్నారు. 2023లో ఈ సినిమా వెలుగు చూడనుంది. మరి ‘హరి హర వీరమల్లు’తో క్రిష్ ఈ సారి ఏ లాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
(నవంబర్ 10న దర్శకుడు క్రిష్ పుట్టినరోజు)