చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్.
కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ. బాల్యం నుంచీ చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా, చదువుతూ పోయేవారు. గుంటూరు హిందూ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్, అదే ఊరిలోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బి.యస్సీ. పట్టా పుచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయా-వాహినీ సంస్థలో పనిచేసేవారు. దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయావాహినీ స్టూడియోస్ లో సౌండ్ రికార్డిస్ట్ గా చేరారు. విజయా సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’కి అసిస్టెంట్ రికార్డిస్ట్ గా చేశారు విశ్వనాథ్. విశ్వనాథ్ కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరు పెట్టుకున్న ఆయన మనసు చిత్రసీమవైపు మరలడంలో ఆశ్చర్యమేముంది?… సౌండ్ ఇంజనీర్ గా చేశాక, ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ‘ఆత్మగౌరవం’ చిత్రంతో కె.విశ్వనాథ్ ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణీ ప్రదర్శించారు విశ్వనాథ్.
నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ తో చిత్రాలు రూపొందించారు విశ్వనాథ్. అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్ బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచీ ఆయన తపించేవారు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకొనేవారు. తెలుగునాట శోభన్ బాబు, చంద్రమోహన్, కమల్ హాసన్ వంటివారు స్టార్ డమ్ చూడటానికి ఆయన చిత్రాలు కారణమయ్యాయని చెప్పవచ్చు.
విశ్వనాథ్ పేరు వినగానే ముందుగా ఆయన చిత్రాలలో పెద్ద పీట వేసుకున్న సంగీతసాహిత్యాలు గుర్తుకు వస్తాయి. తరువాత కథల్లోనే లీనమై ఆకర్షించే కళలూ స్ఫురిస్తాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు కళాఖండాలు నవతరం ప్రేక్షకులను సైతం మురిపిస్తూనే ఉన్నాయి. కె.విశ్వనాథ్ చిత్రాలను చూసి ఆ రోజుల్లో ఎందరో లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తరువాతి రోజుల్లో కళాకారులుగానూ రాణించారు. అంతలా తెలుగువారిని కళలవైపు మళ్ళించిన దర్శకులు మరొకరు కానరారు. ‘శంకరాభరణం’ విడుదలైన రోజుల్లో తెలుగునాటనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ సీమల్లోనూ పలువురు బాలలు గానంపై ధ్యానం పెట్టారు. ఆ చిత్రంతోనే కమర్షియల్ చట్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గౌరవం తీసుకు వచ్చారు విశ్వనాథ్. ‘శంకరాభరణం’ తరువాత విశ్వనాథ్ నిర్దేశకత్వంలో వెలుగు చూసిన “శుభోదయం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం” ఇలా ఎన్నెన్నో కళాఖండాలు మన మదిలో తిష్ట వేసుకున్నాయి.
విశ్వనాథ్ సినిమాల్లో నటిస్తే చాలు అనుకొనేవారెందరో! అలా అనుకున్నవారికి విశ్వనాథ్ చిత్రాలే అభినయంలో శిక్షణ ఇచ్చాయని చెప్పాలి. నటులకు శిక్షణ ఇచ్చిన విశ్వనాథుడు తరువాత నటునిగానూ మురిపించిన వైనం మరపురానిది. ‘శుభసంకల్పం’తో నటునిగా మారిన తరువాత కె.విశ్వనాథ్ వైపు పలు పాత్రలు పరుగులు తీస్తూ వచ్చాయి. అప్పటి దాకా ఎంతోమంది నటీనటులను తీర్చిదిద్దిన విశ్వనాథ్ ఒక్కసారిగా నటనలో బిజీ అయిపోయారు. మహామహులతో పనిచేసిన విశ్వనాథ్ ను డైరెక్ట్ చేసే అదృష్టం కలిగినందుకు ఆ యా చిత్రాల దర్శకులు పులకించిపోయేవారు.
నటునిగా రాణించడం మొదలు పెట్టాక, దర్శకత్వానికి దూరంగానే జరిగారు విశ్వనాథ్. అయితే ఆయన దర్శకత్వం అంటే ప్రాణం పెట్టేవారు మళ్ళీ మెగా ఫోన్ పట్టమని బలవంతం చేశారు. కానీ, కళాతపస్వి అంతకు ముందులా దర్శకత్వంతో ఆకట్టుకోలేక పోయారు. అందుకే దర్శకత్వానికి స్వస్తి అన్నారు. ఇక తన దరికి చేరిన పాత్రలకు మాత్రం న్యాయం చేయడానికి విశ్వనాథ్ తపించారు. ఏది ఏమైనా జనం మదిలో ‘కళాతపస్వి’గా నిలచిపోయారు కాశీనాథుని విశ్వనాథ్!