Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా ‘పెద్ది బాక్సాఫిస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సినిమా వెనుక ఉన్న కథను, రామ్ చరణ్ నమ్మకాన్ని గుర్తుచేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఖేలో ఇండియా ఇన్స్పిరేషన్‌తో ‘మట్టిలో ఆటగాడు’
సినిమా పాయింట్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. “భారతీయ జీవన విధానంలోనే ఆట అనేది ఒక అంతర్భాగం. మట్టిలో దాగున్న నిజమైన ఆటగాడిని వెతకాలనే ఆలోచనతో ‘ఖేలో ఇండియా’ను ఇన్స్పిరేషన్‌గా తీసుకుని ఈ కథ రాశాను. ఒక సాధారణ మనిషికి, ఒక వ్యవస్థ ఇచ్చే గుర్తింపు ఎంత అవసరమో ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. ఇండియాలో ఇప్పటికీ కనెక్షన్ లేని, ఎలాంటి గుర్తింపు లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటినీ స్పోర్ట్స్ ద్వారా ఇండియాలో కలపాలని, ఆ గ్రామాలకు ఒక గుర్తింపు తేవాలని ఈ సినిమా ద్వారా చాటి చెప్పాలనుకున్నాను. ఈ పాయింట్‌ను నేను ఎలాగైతే బలంగా నమ్మానో, రామ్ చరణ్ గారు కూడా అలాగే నమ్మారు” అని అన్నారు.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై బుచ్చిబాబు స్పందిస్తూ.. “నేను కథ రాసుకున్నప్పుడు చివరి 40 నిమిషాలు ఏదైతే మ్యాజిక్ జరుగుతుందని నమ్మానో.. థియేటర్లలో ఇప్పుడు అదే జరుగుతోంది. నేను స్వయంగా థియేటర్ కి వెళ్లి చూశాను, జనాలు కన్నీరు కారుస్తూ సినిమా చూస్తున్నారు. ఐమాక్స్ థియేటర్లలో రామ్ చరణ్ గారితో కలిసి సినిమా చూస్తున్నప్పుడు.. అందులోని హాస్పిటల్ సీన్ చూసి ప్రతి ఒక్కరూ చరణ్‌కు ‘నేషనల్ అవార్డ్ గ్యారెంటీ’ అని ప్రశంసిస్తున్నారు. నేను ఏ ఆశయంతో, దేనికోసం అయితే ఈ సినిమా చేశానో.. అది ఈరోజు పూర్తిగా నెరవేరింది” అంటూ బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేశారు.

