NTV Telugu Site icon

Director Bobby: చిరు సినిమాను రవితేజ రిజెక్ట్ చేశాడు.. కథ నచ్చక వద్దు అంటే..

Ravi

Ravi

Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో జై లవకుశ తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. గతేడాది.. చిరు తో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నాడు బాబీ. ఈ సినిమా కోసం బాబీ చాలా కష్టపడినట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ముందుగా చిరు కోసమే కథను రెడీ చేసినా కూడా .. మధ్యలో రవితేజ పాత్రను అనుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట ఆ పాత్రకు రవితేజ ఒప్పుకోలేదని బాబీ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

“వాల్తేరు వీరయ్య సినిమా కథ ముందు చిరంజీవి గారికి చెప్పాను. అప్పుడు రవితేజ పాత్ర గురించి నేనేమి అనుకోలేదు. కథ మొత్తం పూర్తి అయినా కూడా ఎక్కడో ఏదో అసంతృప్తి. నాకు జీవితాన్ని ఇచ్చింది రవితేజనే.. అందుకే నేను ఏ కథ అనుకున్నా కూడా ఆయనే కనిపించేవాడు. అలా ఓరోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్‌లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ అప్పటికే చిరంజీవితో 80 శాతం సినిమా పూర్తయింది. నేను ఇలా అనుకుంటాను అని నా టీమ్ కు చెప్తే ఓకే అన్నారు. అయితే.. చిరంజీవి గారు ఎలా ఫీల్ అవుతారు అనే విషయం నాకు తెలియదు.. ఒకరోజు రవితేజ అని చెప్పకుండా చిరుకు.. తమ్ముడి పాత్ర గురించి చెప్పాను. ఆ పాత్ర రవితేజ చేస్తున్నాడు కదా.. అదిరిపోయింది అని అన్నారు.

ఇక నిర్మాత అయితే లైట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎంతైనా ఖర్చుపెడతాం.. కానీ, మిస్ ఫైర్ కాకుండా చూసుకో అని చెప్పేశారు. చాలారోజులు అలోచించి.. రవితేజకు ఫోన్ చేసి కథ చెప్పాలి అని అడిగాను. ముందు చిరంజీవిగారి సినిమా పూర్తి చెయ్.. తరువాత చూద్దాం అన్నారు. అయితే ఆరు నెలలపాటు ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుని రవితేజ వద్దకు వెళ్లి కథ చెప్పాలి అంటే.. చిరంజీవి సినిమాలోనా అని అడిగారు. అవును అన్నాను. ముందు కథ చెప్తాను.. నచ్చితేనే చేయండి అన్నాను. ఆయన మాత్రం వద్దులే అబ్బాయ్‌.. ఇప్పటికే నాకు వరుసగా సినిమాలున్నాయ్‌.. మళ్లీ నువ్వు కథ చెప్పాక నచ్చలేదంటే బాగోదు.. చిరు సినిమాను రవితేజ రిజెక్ట్ చేశాడు అన్న పేరు వద్దు అన్నాడు. ముందు కథ వినండి.. తరువాత నచ్చకపోతే చేయొద్దు అని చెప్పాను. కథ కూడా వినకుండా తెల్లారి.. నన్ను పిలిచి, అన్నయ్యతో ఎప్పటినుంచో ఒక సినిమా చేద్దామనుకుంటున్నాను.. చేసేద్దాం అన్నారు. అలా వారిద్దరి కాంబినేషన్‌ కుదిరింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాబీ.. బాలకృష్ణతో NBK109 సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో బాబీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.