Site icon NTV Telugu

Kantara Chapter 1 : కాంతార 1 కోసం పాట పాడిన సెన్సేషనల్ సింగర్

Kantara

Kantara

Kantara Chapter 1 : సినిమా పరిశ్రమలో ఒక కొత్త సంగీత సంచలనం ఆవిష్కృతం కాబోతోంది. నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు-గాయకుడు దిల్జిత్ దోసాంజ్, ‘కాంతారా’ ఫేమ్ డైరెక్టర్-నటుడు రిషభ్ షెట్టితో చేతులు కలిపి, ‘కాంతారా చాప్టర్ 1’ సంగీత ఆల్బమ్‌కు తన స్వరాన్ని అందించాడు. ముంబైలోని వై ఆర్ ఎఫ్ స్టూడియోలలో ఈ రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేసిన దిల్జిత్, ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయస్పర్శిగా పంచుకున్నాడు.

2022లో విడుదలైన ‘కాంతారా’ చిత్రం దిల్జిత్‌ను ఎంతగా ప్రభావితం చేసిందో వివరిస్తూ, అతను ఇలా రాశాడు: “బిగ్ బ్రదర్ రిషబ్ కి సలాం! ‘కాంతారా’ వంటి మాస్టర్‌పీస్‌ను తెరకెక్కించిన ఈ మనిషికి నా హృదయపూర్వక గౌరవం. ఈ చిత్రంతో నాకు ఒక వ్యక్తిగత అనుబంధం ఉంది, దాన్ని వివరించలేను. థియేటర్‌లో ‘వరాహ రూపం’ పాట రాగానే, నా కళ్ళలో ఆనంద భాష్పాలు తిరిగాయి.” అంటూ రాసుకొచ్చిన ఈ పోస్ట్‌లో అతని భావోద్వేగం స్పష్టంగా కనిపిస్తుంది.

రిషభ్ షెట్టి కూడా దిల్జిత్‌తో కలిసి పనిచేసిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బిహైండ్-ది-సీన్స్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. రిషభ్ తన పోస్ట్‌లో “దిల్జిత్ దోసాంజ్‌తో ‘కాంతారా చాప్టర్ 1’ ఆల్బమ్ కోసం కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. 🙏 శివుని కృపతో అంతా సజావుగా జరిగింది. మచ్ లవ్, పాజీ! ❤️🔥 మరో శివ భక్తుడు కాంతారా లోకంలో అడుగుపెడుతున్నాడు.” అంటూ రాసుకొచ్చాడు.

ఈ ఆల్బమ్ కోసం సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్నాథ్‌తో కలిసి పనిచేసిన దిల్జిత్, అతని నుండి చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు. “అజనీష్ సర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకే రోజులో మీతో చాలా నేర్చుకున్నాను,” అని దిల్జిత్ తన పోస్ట్‌లో తెలిపాడు. ఈ రికార్డింగ్ ఒకే రోజులో పూర్తి కావడం విశేషం.

హోంబాలే ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ‘కాంతారా చాప్టర్ 1’, రిషభ్ షెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రుక్మిణి వసంత్, సప్తమి గౌడ, గుల్షన్ దేవయ్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2022లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కాంతారా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Exit mobile version