Dil Raju: 300 కోట్ల బడ్జెట్‌లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్‌పై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Dil Raju (2)

Dil Raju (2)

Dil Raju: టాలీవుడ్‌లో హీరోల రెమ్యునరేషన్‌పై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. స్టార్ హీరోల పారితోషికాలు పెరగడంతో సినిమా బడ్జెట్లు భారీగా పెరుగుతున్నాయని, నిర్మాతలపై ఆర్థిక భారం కూడా అదే స్థాయిలో పెరుగుతోందని పరిశ్రమలో తరచూ వినిపించే మాట. ఇప్పుడు ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్, బాలీవుడ్‌లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దిల్‌రాజు, స్టార్ హీరోల పారితోషికాల గురించి మాట్లాడారు. సినిమా మార్కెట్ పరిస్థితిని హీరోలకు ముందుగానే వివరిస్తానని, తాను ఎంత వరకు పారితోషికం ఇవ్వగలనో స్పష్టంగా చెబుతానని అన్నారు. తన పరిస్థితిని అర్థం చేసుకునే హీరోలతోనే సినిమాలు చేస్తానని వెల్లడించారు. అయితే అగ్ర హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరని, దానికి ప్రధాన కారణం వారి ఇమేజ్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వారు రెమ్యునరేషన్ తగ్గించేందుకు వెనుకాడతారని వివరించారు. ఇక 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు మొత్తం హీరో పారితోషికానికే వెళ్తుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా బాలీవుడ్‌లో అమలవుతున్న విధానాన్ని కూడా దిల్‌రాజు ప్రస్తావించారు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో చాలామంది స్టార్ హీరోలు ముందస్తుగా భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే, సినిమా లాభాల్లో వాటా తీసుకునే ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ విధానం నిర్మాతలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా విజయం సాధిస్తే హీరోలకు కూడా మంచి ఆదాయం వస్తుందని, అదే సమయంలో సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా నిర్మాతపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.

ఈ విషయాన్ని వివరిస్తూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను ఉదాహరణగా ప్రస్తావించారు దిల్‌రాజు. ఒకప్పుడు అక్షయ్ కుమార్ సుమారు130 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారని, అయితే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు లాభాల పంపిణీ విధానాన్ని ఎంచుకున్నారని చెప్పారు. దీంతో నిర్మాతలకు పెట్టుబడి తిరిగి రావడం సులభమవుతుందని, అలాగే హీరోలకు కూడా సినిమా విజయంపై మరింత బాధ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు చిత్రసీమలో మాత్రం ఈ తరహా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని దిల్‌రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో టాలీవుడ్ కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే నిర్మాతలు, హీరోలు ఇద్దరికీ మంచి జరగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ వ్యాఖ్యలతో టాలీవుడ్‌ రెమ్యునరేషన్ పై మరోసారి చర్చ మొదలైంది.