‘పెళ్ళిచూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం’ వంటి చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న ధృవ ఇప్పుడు మరో అడుగు…. కాదు రెండు అడుగులు ముందుకేశాడు. ‘కిరోసిన్’ అనే సినిమాలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించాడు. మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొని యూనిట్ ను అభినందించారు.
ఈ సినిమా గురించి హీరో కమ్ డైరెక్టర్ ధృవ మాట్లాడుతూ, ”నేను గతంలో పోషించిన పాత్రల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది. నా దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడం, అందులో నేనే హీరోగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. మరింత బాధ్యతనూ పెంచింది. ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన సినీ ప్రముఖులు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమా విజయంపై మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. జూన్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడండి” అని కోరారు. ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, ‘కేరాఫ్ కంచరపాలెం’ రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.