Dhamaka Trailer: మాస్ మహరాజా రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ‘ధమాకా’ సినిమా ట్రైలర్ గురువారం సాయంత్రం జనం ముందు నిలచింది. రవితేజ బాణీకి తగ్గ రీతిలోనే ‘ధమాకా’ను తీర్చిదిద్దినట్టు స్పష్టంగా ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. “కోట్లలో ఒకడాడు…” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూండగా ఈ ట్రైలర్ మొదలవుతుంది.
హీరోయిన్ తనకు ఇద్దరబ్బాయిలు నచ్చినట్టు చెబుతూ ఉంటుంది. ఇద్దరూ రవితేజలే కనిపించడం ఓ ట్విస్ట్! అదేదో సినిమాలో చూసుకోవచ్చు. కానీ, ఈ ట్రైలర్ లో మరిన్ని ముచ్చట్లున్నాయి. “చిత్తక చిత్తక…” అంటూ సాగే పాటలో రవితేజ చిందులు చూస్తోంటే ‘విక్రమార్కుడు’ నాటి “జింతాతా జితా జితా…” గుర్తుకు రాకమానదు. ఇక జయరామ్ పాత్ర ద్వారా “మనకు కావలసిన వాళ్ళకు చేస్తే మోసం… మనకు కావాలీ అనుకున్నవాళ్ళకి చేస్తే న్యాయం…” అంటూ పలికించారు. అది మరో ట్విస్ట్ అనుకునే లోపే “కొట్రా… మాస్ రాజా… ఉటాకే మార్ బ్యాండ్ బాజా…” అంటూ మరో మాస్ పల్స్ పట్టుకొనే పాట వస్తుంది. “అమ్మ పళ్ళు తెమ్మంది…” అంటాడు హీరో, “మరి ఫ్రూట్ షాప్ కెళ్ళాలి కదా…” అన్నది రఘుబాబు మాట. “నిన్నెవడో ఇంటికొచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట. వాడి పండ్లు తెమ్మంది…” అంటూ మాస్ మహరాజా స్టైల్ కామెడీ కనిపిస్తుంది.
చివరలో “నేను వెనకున్న వాళ్లని చూసుకొని ముందుకొచ్చిన వాణ్ణి కాదురోయ్… వెనక ఎవడూ లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాణ్ణి…” అనే మాస్ మహారాజా రియల్ లైఫ్ కొటేషన్ కొట్టేశాడు. ఇన్ని హంగులున్న ‘ధమాకా’ ట్రైలర్ మాస్ ను ఆకట్టుకొనే అన్ని అంశాలూ నింపుకుంది. డిసెంబర్ 23న రానున్న ‘ధమాకా’ మరెంతగా జనాన్ని అలరిస్తుందో చూడాలి.