మే 27వ తేదీన ఎఫ్3 సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్.. ఇందులో ఎఫ్3కి మించిన వినోదం ఉందని, అలాగే ఓ చక్కటి సందేశమూ ఉందని చెప్పాడు. జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించారో.. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యమే ‘ఎఫ్3’లో ఉందని తెలిపాడు.
దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఎఫ్3 కథను అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా రాశాడు, తీశాడు. ఆర్ఆర్ చేస్తున్న సమయంలో నేను పడిపడి నవ్వుకున్నాను. ప్రేక్షకుల్ని నవ్వించాలని కంకణం కట్టుకొని మరీ ఈ సినిమా తీసినట్లుగా అనిపించింది. అలాగే ఈ చిత్రంలో ఓ సందేశం కూడా ఉంది, దాన్ని అనిల్ చాలా గొప్పగా చెప్పాడు. అసలు అనిల్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే, సినిమా చూసినట్లు ఉంటుంది. ఇందులో ప్రధాన నటీనటులందరూ హిలేరియస్‌గా చేశారు’’ అని చెప్పాడు. రీ-రికార్డింగ్ అంతా చూసి.. ‘అద్భుతంగా చేశారు, మీకు వంద హగ్గులు, వంద ముద్దులు’ అని అనిల్ రావిపూడి చెప్పడం చాలా ఆనందాన్నిచ్చిందని దేవి వెల్లడించాడు.
