“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ పవర్ ఫుల్ టైటిల్ పవన్‌కు అదిరిపోతుందని అనుకున్నారు కానీ ఇదే టైటిల్‌ను ఇప్పుడు ఎన్టీఆర్30 కోసం లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి దేవర అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టేనని సమాచారం. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫాన్స్ కి ఒక రోజు ముందే కిక్ ఇస్తూ మే 19నే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేసే ఛాన్స్ ఉంది. దేవర అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసి అనౌన్స్ చేస్తే, ఒక మాస్ మేనియాని సోషల్ మీడియాలో చూసే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 థియేటర్లలోకి రానుంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ ని నిజం చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కి ‘దేవర’గా మారుస్తాడో లేదో చూడాలి.
