గతవారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదలైన సినిమాలలో దీపిక, యామీగౌతమ్ నటించిన సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో దీపిక నటించిన ‘గెహ్రాయియా’, డిస్నీ హాట్‌స్టార్‌లో యామీగౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ స్ట్రీమింగ్ అయ్యాయి. గత వారం ట్రాకింగ్ రిపోర్టులతో పాటు బాక్సాఫీస్ ట్రేడ్ ప్రకారం ఈ రెండు సినిమాలనే ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించినట్లు తెలుస్తోంది. దీపికా సినిమా ట్రైలర్‌లో చూపించినట్లు వివాహేతర సంబంధం కాదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు ఇతరులకు ఎలా ఆకర్షితులవుతారు… దాని పర్యవసానం ఏమిటి చూపించారు. క్లైమాక్స్ లో మర్డర్ ట్విస్ట్, తను చేసిన పని వల్ల అపరాధ భావనతో దీపిక తన జీవితమంతా అబద్ధంతో జీవించవలసి వచ్చిన విధానం చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమాను గత వారాంతంలోనే అమెజాన్ ప్రైమ్‌లో 7.1 మిలియన్ల మంది చూచినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇక యామీ గౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ రేప్ బాధితురాలి కష్టాలను ప్రపంచానికి తెలియ చెప్పడానికి పిల్లలను కిడ్నాప్ చేసి, ప్రధాన మంత్రినే తన వద్దకు రిప్పించుకున్న వైనంతో తెరకెక్కింది. గతంలో వచ్చిన ‘ఎ వెన్స్ డే’ సినిమాకు దగ్గర పోలిక ఉన్నప్పటికీ దర్శకుడు ఆ భావన కలగకుండా తీయటం విశేషం. ఈ మూవీని గత వారంతంలో దాదాపు 5.1 మిలియన్ల మంది చూడటం గమనార్హం. ఇందులో యామి నటన అందరినీ ఆకట్టుకునేలా సాగింది. ఈ రెండు సినిమాల తర్వాత హాట్‌స్టార్‌లో 4.6 మిలియన్ల వీక్షణలతో ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’ వెబ్ సీరీస్ నిలవడం విశేషం. ఆ తర్వాత శ్రుతి హాసన్ నటించిన ‘బెస్ట్ సెల్లర్’ ప్రైమ్‌లో 2.5 మిలియన్ల మంది చూడటం కూడా మరింత విశేషమైన విషయం