Dasari Narayana Rao: అసలైన ‘అందరివాడు’ అంటే దాసరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు తెరపై దర్శకరత్న దాసరి నారాయణరావుది ఓ చెరిగిపోని సంతకం. దర్శకుడు అంటే సినిమా క్రూ కు కెప్టెన్ అనేది పాత కాలం మాట. దానిని మళ్ళీ తీసుకువచ్చి, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ అని చాటిన ఘనుడు దాసరి నారాయణరావు. ఆయన భౌతికంగా దూరమై అయిదేళ్ళయింది. ఇంకా దాసరి మనమధ్య ఉన్నట్టే భావిస్తున్నారు అభిమానులు. 151 చిత్రాల రూపకల్పనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన మేటి దర్శకుడు దాసరి. టాప్ స్టార్స్ మొదలు, అప్ కమింగ్ ఆర్టిస్టులతోనూ చిత్రాలు తెరకెక్కించి ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు దాసరి. ఆయన సినిమాల ద్వారానే ఎంతోమంది చిత్రసీమలో స్థిరపడిపోయారు. అందుకే దాసరి నారాయణరావు అంటే తెలుగువారికి ఓ ప్రత్యేకమైన అభిమానం. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలయితే చాలు, జనాల్లో ఆసక్తి రేకెత్తేది. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆబాలగోపాలాన్నీ అలరించే చిత్రాలను రూపొందించి మెప్పించారు దాసరి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాణం, దర్శకత్వం ఇలా పలు శాఖల్లో తనదైన బాణీ పలికించిన మేటి దాసరి! ఆయన బహుముఖ ప్రజ్ఞ మనలను పలకరిస్తూనే ఉంటుంది.
దాసరి నారాయణరావు 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయన తండ్రి సగటు జీవి. చాలీచాలని సంపాదన, అయినా దాసరిలో చదువుకోవాలన్న తపన ఉండేది. చిన్నతనంలోనే పనిచేస్తూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి మెప్పించారు. డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే పంథాలో సాగారు. చదువులో తెలివైన వారు కావడంతో హైదరాబాద్ హెచ్.ఏ.ఎల్. సంస్థ పెట్టిన పరీక్షలో నెగ్గి టైపిస్ట్ గా ఉద్యోగం సంపాదించారు. బాలనగర్ లో ఉద్యోగం చేస్తూనే రవీంద్రభారతిలో నాటకాల వేసేవారు. అలా ఓ సినిమా వ్యక్తి ప్రోత్సాహంతో అమాయకంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆరంభంలోనే ఓ చిన్న వేషానికి మాత్రమే పాత్రులయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి అన్న సంకల్పంతో చిత్రసీమలోనే ఉంటూ కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొందరికి ఘోస్ట్ రైటర్ గానూ ఉన్నారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో ఆయనతో కలసి పలు సినిమాలకు పనిచేశారు. రచయితగానూ మంచి పేరు సంపాదించారు. ఫల్గుణ ఫిలిమ్స్ అపరాధ పరిశోధన చిత్రాలకు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు. తెలుగునాట “గూట్లే, డోంగ్రే…” వంటి పదాలకు విశేషాదరణ లభించేలా చేసింది దాసరి కలం. ఫల్గుణలో పార్ట్ నర్ గా ఉన్న కె.రాఘవ బయటకు వచ్చి ‘ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్’ స్థాపించారు. దాసరిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత-మనవడు’ నిర్మించారు. తొలి చిత్రంతోనే దాసరి నారాయణ రావుకు ఎంతో పేరు లభించింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు.
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
దాసరి ఎందరు టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, నటరత్న యన్టీఆర్ తోనే ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పాలి. నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి” చిత్రాలన్నీ శతదినోత్సవాలు చూశాయి. వాటిలో ‘సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి” బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ నటరత్న నటనావైభవం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. ఆ వైనాన్ని ఈ నాటికీ ఎవరూ మరచిపోలేరు. ‘దేవదాసు’ చూసి, అక్కినేని వీరాభిమానిగా మారిన దాసరి నారాయణరావు, ఏయన్నార్ తో ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ అని తెరకెక్కించారు. అదంతలా ఒప్పించకపోయినా, దాసరిలోని క్రియేటివిటీని చూసి జనం మెచ్చారు. తరువాత పలు చిత్రాలలో తన అభిమాన నటునితో పయనించి ఆకట్టుకున్నారు. వాటిలో అన్నిటికన్నా మిన్నగా అలరించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’ అనే చెప్పాలి. ఇందులో అక్కినేని అభినయం, దాసరి దర్శకత్వం తెలుగువారిని విశేషంగా మురిపించాయి.
టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, వారిలోని నటనకే దాసరి ప్రాధాన్యమిచ్చేవారు తప్ప, కమర్షియల్ హంగులతో కనికట్టు చేయాలని ఏ నాడూ తపించలేదు. దాసరి చిత్రాల్లో ఏముంటుంది? అంటే మనసులు తాకే కథ ఉంటుంది. ఆలోచింప చేసే మాటలు ఉంటాయి. ఆకట్టుకొనే పాటలు ఉంటాయి. నిజమే, ఆయన తెరకెక్కించిన చిత్రాలలో అవన్నీ చోటు చేసుకొని సినిమా చూసిన ప్రేక్షకుణ్ణి ఇంటిదాకా వెంటాడేవి. మళ్ళీ సినిమా థియేటర్ కు వచ్చేలా చేసేవి. అదీ దాసరి ప్రతిభలోని మహత్తు. దాసరి తొలి చిత్రం ‘తాత-మనవడు’ మొదలు, దాదాపు ఆయన తెరెక్కించిన అన్ని చిత్రాలలోనూ మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్యలను ఏదో విధంగా చొప్పించేవారు. ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు తగిన మార్గాలూ చూపించేవారు. అందుకే ఆ రోజుల్లో దాసరి సినిమాలకు మహిళా ప్రేక్షకులు పోటెత్తేవారు.
ఒకటా రెండా, 151 చిత్రాల రూపశిల్పి దాసరి. ఆయన చిత్రాలలో అన్నీ విజయం సాధించి ఉండక పోవచ్చు. కానీ, అన్నిటా ఎక్కడో ఓ చోట మనసును తడిచేసే సన్నివేశాలను చొప్పించేవారు. దాసరి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో తమ ఉనికిని చాటుకున్నారు. కొందరు స్టార్స్ గానూ ఎదిగారు. ఇక చిత్రసీమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, దాని పరిష్కారానికి దాసరి ముందుండేవారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేవారు. ఆపన్నులను ఆదుకోవడానికి దాసరి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. అర్ధరాత్రి ఆయన దగ్గరకు వెళ్ళినా, తగిన న్యాయం జరగుతుందని సినిమా జనం భావించేవారు. అందుకే అసలైన ‘అందరివాడు’ అంటే దాసరే అని ఈ నాటికీ జనం చెప్పుకుంటున్నారు.
ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగువారికి అందించిన దాసరి నారాయణరావు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులూ, రివార్డులూ రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. నేడు దాసరి లేరు. ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలచిన దాసరి తెలుగువారి మదిలో సదా నిలచే ఉంటారు. ఎందరి మదిలోనో ‘గురువు గారు’గా కొలువై ఉన్నారు. ఇక తెలుగు సినిమా రంగానికి ‘పెద్దాయన’గానూ ఆయన తనదైన బాణీ పలికించారు. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సినీజనం అంటూనే ఉన్నారు.
దాసరి జయంతిని తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్స్ డే గా పరిగణిస్తూ గత కొన్నేళ్ళుగా వేడుకలు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వేడుకలు చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన ఒక భారీ వేడుక వాయిదా పడింది కానీ ఈరోజు ఫిలిం చాంబర్లో దర్శకుల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపబోతున్నారు.
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!