NTV Telugu Site icon

The Kerala Story: ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలో మరో సినిమా! వివాదాల నీలినీడలు!!

K

K

Adah Sharma: కశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను నిరశిస్తూ వచ్చిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. హిందూ పండితుల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా విడుదలైనప్పుడు రకరకాల వాదోపవాదాలు జరిగాయి. ఇలాంటి సినిమాల కారణంగా సామాజిక సామరస్యం దెబ్బతింటుందని కొందరు వాదిస్తే, దేశం నడినెత్తిన జరిగిన దారుణాలను ఈ తరానికి చూపితే తప్పేమిటని మరి కొందరు వాదించారు. చర్చోపచర్చల మధ్య విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ హిందీలోనే కాదు… వివిధ భారతీయ భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. చిత్రం ఏమంటే… ఆ సినిమా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని మీద విమర్శలు, ప్రతి విమర్శలు ఆగలేదు. ఇప్పుడు దాదాపు అదే తరహాలో మరో సినిమా మే 5వ తేదీ జనం ముందుకు రాబోతోంది. అదే ‘ది కేరళ స్టోరీ’.
గడిచిన కొన్ని సంవత్సరాలలో కేరళలో దాదాపు 32 వేలమంది మహిళలు ఇస్తాం మతంలోకి మారారని, అందులో చాలామంది ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నారని దర్శకుడు సుదీప్తో సేన్ చెబుతున్నాడు. ఆ నిజ సంఘటనల ఆధారంగానే తాను ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కించానని అంటున్నాడు. హిందు, క్రైస్తవ మహిళలను లవ్ జిహాద్ లో భాగంగా ప్రేమ పేరుతో వలవేసి, ఆపైన మతంమార్చి ముస్లిం రాజ్య స్థాపన కోసం పావులుగా వాడుకుంటున్నారని దర్శకుడు తెలిపాడు. ఇందులో కొందరు మహిళలను ఉద్యోగం పేరుతో విదేశాలకు పంపి, అక్కడ చిత్రహింసలు పెట్టడంతో కొందరు పారిపోయి స్వదేశానికి వస్తున్నారని, వారి జీవిత గాథలనే తాను తెరకెక్కించానని సుదీప్తో చెబుతున్నారు. విపుల్ అమృత్ షా హిందీలో నిర్మించిన ‘ది కేరళ స్టోరీ’ని వివిధ భాషల్లో అనువదించి, మే 5న విడుదల చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా టీజర్ గత యేడాది నవంబర్ లో విడుదలైప్పుడే చాలామంది దీనిపై విమర్శల వర్షం కురిపించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ మాదిరే ఈ సినిమా కూడా దేశంలో సామరస్య వాతావరణానికి భంగం కలిగిస్తుందని ఆరోపించారు. ఈ సినిమాలో చూపించిన సంఘటనలకు సరైన ఆధారాలు లేకుండా సి.బి.ఎఫ్.సి. సర్టిఫికెట్ ఇవ్వకూడదని కోరారు.
ఇదిలా ఉంటే బుధవారం ‘ది కేరళ స్టోరీ’ సినిమా ట్రైలర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. అప్పటి నుండి మరోసారి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కేరళ ఏ రకంగా ఇస్లామిక్ స్టేట్ గా మారుతోందో ఈ సినిమా చెబుతోందని, ఇలాంటివి తప్పకుండా రావాలని కొందరు వాదిస్తుంటే… తమ విమర్శలను బేఖాతరు చేసి మూవీని రిలీజ్ చేస్తే ఊరుకునేది లేదని మరికొందరు అంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అండ చూసుకునే ఇలాంటి సినిమాలను నిర్మిస్తున్నారని, కేరళను ఇతర రాష్ట్రాల ముందు తక్కువ చేసి చూపించడానికే ఈ సినిమా వస్తోందని మరికొందరు వాపోతున్నారు. కేరళలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి కోర్టును ఆశ్రయించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. విశేషం ఏమంటే… ఇందులో లీడ్ క్యారెక్టర్స్ చేసిన అదాశర్మ, సిద్ధి ఇద్నానీ ఇద్దరూ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ప్రేమకథా చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపించే వీరు… ఇలాంటి వివాదాస్పదమైన సినిమాలో నటించారంటే గ్రేట్! మరి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ‘ది కేరళ స్టోరీ’మే 5న విడుదల అవుతుందో లేదో చూడాలి!

Show comments