దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక రెండోది ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ వస్తున్న ‘విరాట పర్వం’ విడుదల తేదీని ప్రీపోన్ చేయడం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారానికి తెర దించుతూ, ఆ మధ్య ‘విరాటపర్వం’ నిర్మాతలు ఈ మూవీని జూలై1న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే… ఇప్పుడు మనసు మార్చుకుని రెండు వారాల ముందే అంటే జూన్ 17వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయబోన్నట్టు తెలిపారు.
1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి అతని ప్రియురాలు వెన్నెల పాత్రలో కనిపించనుంది. సివిల్ వార్ నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా ‘విరాట పర్వం’ ఉండబోతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. రానా, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సురేశ్ బాబు దీనికి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. జూన్ 17వ తేదీనే సత్యదేవ్ ‘గాడ్సే’, సుదీప్ కన్నడ అనువాద చిత్రం ‘కె 3’ కూడా విడుదల కానున్నాయి.