Site icon NTV Telugu

Tollywood: ‘కోబ్రా’ కాటేసింది… మిగతావాటి సంగతేంటో!?

Tolly Wood

Tolly Wood

ఈ వారం సినిమా సందడి బుధవారం నాడే మొదలైపోయింది. 31వ తేదీ వినాయక చవితి రోజునే విక్రమ్ ‘కోబ్రా’ మూవీ జనం ముందుకు వచ్చింది. మూడేళ్ళ తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ విక్రమ్ సినిమా, సగటు సినీ ప్రేక్షకుడినే కాదు, ఆయన అభిమానులనూ నిరాశకు గురిచేసింది. మూడు గంటల పైగా రన్ టైమ్ ఉన్న ‘కోబ్రా’ ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. ‘కోబ్రా’ పేరుకు తగ్గట్టే పగబట్టి, వెంటాడి, కాటేసిందంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

ఇక శుక్రవారం ఏకంగా ఒక అనువాద చిత్రంతో కలిపి ఏడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమాలు రెండు మూడున్నాయి. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా ‘రంగరంగ వైభవంగా’ శుక్రవారం వస్తోంది. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాతో తమిళ దర్శకుడు గిరీశాయను టాలీవుడ్ కు తీసుకొచ్చారు. కేతిక శర్మ నాయికగా నటిస్తోంది. ‘జాతిరత్నాలు’ మూవీతో సూపర్ హిట్ ను అందుకున్న దర్శకుడు అనుదీప్ కె. వి. కథ, చిత్రానువాదం అందించిన సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దీన్ని అలనాటి ప్రముఖ నిర్మాత, స్వర్గీయ ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, శ్రీరామ్ కుమార్తె శ్రీజ నిర్మించింది. ఈ మూవీతో హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు పరిచయం అవుతున్నారు. అలానే వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ డైరెక్టర్స్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ రిలీజ్ రోజుకు సంబంధించింది కావడం విశేషం. ఇక హాస్యనటులు ధనరాజ్, సునీల్ పోలీస్ ఆఫీసర్స్ గా నటించిన సినిమా ‘బుజ్జీ… ఇలా రా’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సీనియర్ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకత్వం వహించారు. నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ సినిమా కూడా శుక్రవారమే వస్తోంది.

వీటితో పాటుగా గౌతమ్ కృష్ణ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఆకాశ వీధుల్లో’; తేజ్ కూరపాటి సోలో హీరోగా నటించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’; ప్రియాంక శర్మ, శివ ఆలపాటి ప్రధాన పాత్రలు పోషించిన ‘డైహార్డ్ ఫ్యాన్’; ధ్రువ సర్జా, రచితారామ్, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ అనువాద చిత్రం ‘పుష్పరాజ్’ కూడా శుక్రవారమే విడుదల కాబోతున్నాయి. సో… ‘కోబ్రా’ కాటుకు విలవిల లాడిన ప్రేక్షకులకు ఈ సినిమాలైనా కాస్తంత వినోదాన్ని అందిస్తాయేమో చూడాలి!

Exit mobile version