Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!

Dil Raju

Dil Raju

Dil Raju: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ అంచనాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో దిల్ రాజు చేసిన పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సుమారు రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు హీరో నటించని ఓ సినిమాకు ఈ స్థాయిలో డీల్ జరగడం అత్యంత భారీ విషయంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

యశ్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ అడిగిన మొత్తానికి దిల్ రాజు ఎలాంటి సందేహం లేకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ డీల్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ‘టాక్సిక్’ బ్రేక్ ఈవెన్ కోసం దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సిన పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇప్పటికే ‘టాక్సిక్’పై భారీ హైప్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన, సినిమాపై ఉన్న బజ్, లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ఈ మూవీ భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యశ్‌తో భవిష్యత్తులో నేరుగా ఓ తెలుగు సినిమా చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. కథ నచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది నిర్ణయిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో యశ్‌తో దిల్ రాజు చేయబోయే తెలుగు సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.