Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..

Yash, Ntr & Nani Films

Yash, Ntr & Nani Films

Yash, NTR , Nani Films: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో హీరో ఇమేజ్‌తో పాటు అతడి చుట్టూ డైరెక్టర్ సృష్టించే ప్రపంచం కూడా కీలకంగా మారుతోంది. భారీ బడ్జెట్‌, గ్రాండ్ విజువల్స్‌, యూనిక్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ కోవలో యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలు నిలుస్తున్నాయి. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని డిజైన్ చేసినట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ద్వారా అర్థం అవుతుంది. 1960ల కాలానికి సంబంధించిన మాఫియా, పవర్ గేమ్ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడమే దర్శకురాలి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇంత భారీ ప్రపంచాన్ని రెండు మూడు గంటల్లో ప్రేక్షకులకు అర్థమయ్యేలా, భావోద్వేగంగా కనెక్ట్ చేయడం ‘టాక్సిక్’కు అసలు పరీక్షగా మారనుంది. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో స్క్రీన్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విజువల్స్‌, మేకింగ్‌, వరల్డ్ బిల్డింగ్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. వాటికి తగ్గట్టుగా కథ, క్యారెక్టర్లు బలంగా ఉంటేనే ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో ఫలిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కూడా ‘వరల్డ్ ఈజ్ ది హీరో’ అనే కాన్సెప్ట్‌కు మరో ఉదాహరణగా నిలుస్తోంది. 1960ల నాటి నల్లమందు మాఫియా, రెండు ట్రేడింగ్ కంపెనీల మధ్య పవర్ వార్ చుట్టూ ఈ కథను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్‌, ప్రచార కంటెంట్ చూస్తే ప్రశాంత్ నీల్ మరో కొత్త క్రైమ్ ప్రపంచాన్ని సృష్టించినట్లు అర్థమవుతోంది. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో వరల్డ్ ఎంత బలంగా ఉంటుందో.. అందులోని కథ, క్యారెక్టర్లు కూడా అదే స్థాయిలో ప్రభావవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే భారీ యాక్షన్‌, గ్రాండ్ విజువల్స్ ఉన్నప్పటికీ సినిమా కేవలం మరో స్టైలిష్ యాక్షన్ మూవీగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’ విషయంలోనూ వరల్డ్ బిల్డింగ్‌దే కీలక పాత్రగా కనిస్తోంది. 1980ల నాటి సికింద్రాబాద్ బస్తీ, అణచివేత, మనుగడ కోసం పోరాటం వంటి అంశాల చుట్టూ ఒక రఫ్ అండ్ రియలిస్టిక్ ప్రపంచాన్ని దర్శకుడు సృష్టిస్తున్నట్లు ప్రచార కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో నాని ఎలా కనిపిస్తున్నాడన్నదానికంటే.. అతను జీవిస్తున్న ప్రపంచం ఎలా ఉంటుందనేదే ఆసక్తిని పెంచుతోంది.

‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే సినిమా పలుమార్లు వాయిదా పడటం కొంత నెగిటివ్ బజ్‌కు కారణమైంది. దీంతో ఇప్పటికే భారీగా నిర్మించిన ఈ ప్రపంచానికి సరిపోయే కథను దర్శకుడు ప్రేక్షకులకు అందిస్తారా అనేదే ‘ది ప్యారడైస్‌’కు అసలు పరీక్షగా మారింది. మొత్తంగా ‘టాక్సిక్’లో డార్క్ గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌, ‘డ్రాగన్’లో 1960ల మాఫియా ప్రపంచం, ‘ది ప్యారడైస్’లో రఫ్ రియాలిటీ వరల్డ్‌.. ఇలా మూడు సినిమాలు మూడు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అయితే ప్రపంచం ఎంత గ్రాండ్‌గా ఉన్నా.. ప్రేక్షకుడు ఆ ప్రపంచంతో భావోద్వేగంగా కనెక్ట్ అయినప్పుడే అది విజయవంతమవుతుంది. ఇప్పుడు హీరో ఎంత పెద్ద స్టార్ అన్నదానికంటే.. అతడి కోసం సృష్టించిన ప్రపంచం ఎంత బలంగా ఉంది? అనేదే బాక్సాఫీస్‌ వద్ద అసలు ప్రశ్నగా మారుతోంది.