Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?

Movie Interval

Movie Interval

The Real Reason Behind Movie Interval: థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో స్క్రీన్‌పై ‘ఇంటర్వెల్’ అంటూ బ్రేక్ రావడం మనందరం ఎప్పటినుంచో చూస్తున్నాము. సినిమా కథలో కీలకమైన మలుపు తర్వాత వచ్చే ఈ విరామం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే అసలు సినిమా మధ్యలో ఈ ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కొనుకుంనేందుకు ఈ బ్రేక్ కాదు. అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

ఒకప్పుడు సినిమాలను ప్రస్తుతంలా డిజిటల్ టెక్నాలజీతో కాకుండా.. ఫిల్మ్ రీళ్లతో ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించేవారు. ఒక రీల్ పూర్తయిన తర్వాత మరో రీల్‌ను ప్రొజెక్టర్‌లో అమర్చేందుకు కొంత సమయం పట్టేది. సాధారణంగా ఈ ప్రక్రియకు సుమారు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ప్రేక్షకులను ఖాళీగా కూర్చోబెట్టకుండా ఆ సమయంలో విరామం ఇచ్చేవారు. అలా సినిమాల్లో ‘ఇంటర్వెల్’ అనే సంప్రదాయం మొదలైంది. కాలక్రమేణా సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫిల్మ్ రీళ్ల స్థానంలో డిజిటల్ ప్రొజెక్షన్ అందుబాటులోకి రావడంతో.. రీళ్లు మార్చాల్సిన అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ ప్రేక్షకులకు అలవాటైన ఇంటర్వెల్‌ను తొలగించలేదు. క్రమంగా అది సినిమా ప్రదర్శనలో ఒక భాగంగా, భారతీయ సినిమా సంస్కృతిలో ప్రత్యేకమైన సంప్రదాయంగా మారిపోయింది.

అయితే ఇప్పుడు ఈ ఇంటర్వెల్ సమయం థియేటర్ యాజమాన్యాలకు అదనపు ఆదాయ వనరుగా మారిందనే చెప్పాలి. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు పాప్‌కార్న్, చిప్స్, సమోసా, కూల్‌డ్రింక్స్ వంటి తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు తక్కువ ధరకు దొరికే ఈ పదార్థాలు ఇప్పుడు చాలా ఖరీదైనవిగా మారాయి. చివరకు తక్కువ ధరలో లభించే వాటర్ బాటిల్ కూడా థియేటర్లలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. టికెట్ ధరతో పోలిస్తే ఇంటర్వెల్ సమయంలో తినుబండారాలపై చేసే ఖర్చు ఎక్కువగా ఉంటోందని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వెళితే టికెట్లతో పాటు స్నాక్స్, డ్రింక్స్ వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూసేందుకు వెళితే.. టికెట్లు, తినుబండారాలు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతున్న పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు రీల్ మార్చేందుకు అవసరమైన సాంకేతిక విరామంగా మొదలైన ఇంటర్వెల్.. ఇప్పుడు ప్రేక్షకులకు అదనపు ఖర్చుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.