Cult Release Date: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘#కల్ట్’ రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు పెద్దగా రాని ‘స్లాషర్ థ్రిల్లర్’ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్ కాకరాల, కరాటే రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో విశ్వక్ సేన్ రక్తంతో తడిసిన గొడ్డలి పట్టుకుని కనిపించిన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది.‘ఆర్-రేటెడ్’ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

