విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’. రష్మిక దేవరకొండ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహిచింది. ఈ వేడుకలో హీరో, దర్శకుడు, చిత్ర నిర్మాతలు, నటి ఈశ్వరీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రేక్షకులు సినిమాపై చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. రణబాలి విజయంతో తన నట జీవితానికి కొత్త అర్థం వచ్చిందని పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ‘రణబాలి మూవీని ప్రేక్షకులు ఇంతగా అక్కున చేర్చుకోవడంతో నటుడిగా నా జీవితానికి కొత్త అర్థం చేకూరినట్టైంది. రణబాలి మూవీ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని ముందే చెప్పా. ఆ మాటను ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమాకు ఇంతటి ఆదరణ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కేవలం ఓ నటుడిగా రణబాలి మూవీ చేయలేదు. ఈ నేల కథ చెప్పాలన్న ఓ బాధ్యతతో చేశా. నాకు ఇంత ప్రేమను, నన్ను ప్రేమించే ఇంతమందిని ఇచ్చిన రాయలసీమపై నాకున్న కృతజ్ఞతను చాటాలని రణబాలి సినిమా చేశాను. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ఈ నేలపై నాకు ఎంతో అభిమానం ఉంది. ఆ ప్రేమను, కృతజ్ఞతను ఈ సినిమా ద్వారా తెలియజేయాలనుకున్నాను’ అని విజయ్ చెప్పుకొచ్చారు.

