విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సోషల్ మీడియాలో కొన్ని పోర్టల్స్ రిపోర్ట్ చేశాయి. ఈ వార్త అభిమానులకు ఆందోళన కలిగించినప్పటికీ, ఆయన కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఆయన వెంట ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటోందని అంటున్నారు. వైద్యులు విజయ్‌ను పర్యవేక్షిస్తూ, ఉత్తమ వైద్య సంరక్షణ అందిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో, అంటే జులై 20 నాటికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. విజయ్ దేవరకొండ, తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ALso Read : Akshay Kumar : 700 మంది స్టంట్‌మెన్‌లకు అక్షయ్ కుమార్ సహాయం!
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో యువతలో భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఈ నటుడు, ఇటీవలి కాలంలో వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్నప్పటికీ, తన తదుపరి చిత్రం ‘కింగ్‌డమ్’తో మళ్లీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ ఆరోగ్య సమస్య విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం ‘కింగ్‌డమ్’ ప్రమోషన్‌లకు తాత్కాలికంగా అడ్డంకిగా మారినప్పటికీ, జులై 31న థియేటర్లలో విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, స్వాతంత్ర్యానంతర శ్రీలంకలోని సింహళ-తమిళ సంఘర్షణ నేపథ్యంలో రూపొందింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు సొంతం చేసుకున్నట్టు ఓ ప్రచారం ఉంది.