VFX : ‘రావు బహదూర్’ వీఎఫ్ఎక్స్ వెనుక తెలుగు వ్యక్తి

Ramjee Dot Vfx

Ramjee Dot Vfx

తెలుగు సినిమా సాంకేతిక విభాగం ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటూ దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కథలో లీనమయ్యే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువయ్యాయి. ఇక వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ రాంజీ డాట్ విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం ఒక టెక్నికల్ అవసరంగా కాకుండా, కథను మరింత ప్రభావవంతంగా చెప్పే అద్భుత సాధనంగా మలుస్తూ టాలీవుడ్‌లో సరికొత్తగా సినిమా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. రాంజీ డాట్ ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన, వైవిధ్యమైన చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించి మెప్పించారు. ఒక్కో సినిమాలో ఆయన సృష్టించిన విజువల్స్ ఒక్కో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

మహానటిలో పాతకాలపు (పీరియడ్) సెటప్ ను అత్యంత సహజంగా వెండితెరపై పునఃసృష్టించి ప్రశంసలు అందుకున్నారు. మిరాయ్ లో ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని నమ్మశక్యంగా ఆవిష్కరించడంలో సఫలమయ్యారు. ఇక రాంజీ డాట్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచింది ‘రావు బహదూర్’. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో సుమారు అరగంటపాటు పూర్తిగా క్రియేటివ్ 3D VFX ఆధారిత సన్నివేశాలే ఉంటాయి. ఇవి కేవలం సాధారణ గ్రాఫిక్స్ షాట్లు కావు; కాన్సెప్ట్ రూపకల్పన నుండి థియేట్రికల్ ఎగ్జిక్యూషన్ వరకు పూర్తిగా ఇమాజినేషన్ తో రూపొందించిన ప్రత్యేక విజువల్ సీక్వెన్స్‌లు. ఈ విజువల్స్ తెలుగు సినిమాలో క్రియేటివ్ వీఎఫ్ఎక్స్‌కు సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనున్నాయి. అంతేకాక ఆయన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ టెక్నాలజీ ఆధారంగా ‘మహావీర్ కర్ణ’ టీజర్‌ను రూపొందించారు. రియల్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్, CGI, డిజిటల్ ఎన్విరాన్‌మెంట్స్‌ను సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆయన అందించిన విజువల్స్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి.