కరోనాతో నటుడు, దర్శకుడు, నిర్మాత లలిత్ బెహల్ మృతి కోవిడ్ -19 సంబంధిత అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్ళు. గతవారం ఈ సీనియర్ నటుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. లలిత్ బెహల్ కుమారుడు, దర్శకుడు కను బెహల్ మాట్లాడుతూ ‘శుక్రవారం మధ్యాహ్నం ఆయన చనిపోయారు. గతంలో నుంచి గుండెకు సంబంధించిన అనారోగ్యం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది’ అని తెలిపారు. పలు చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా పని చేసిన ఆయన కుమారుడు కను బెహల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టిట్లీ’, ‘ముక్తి భవన్’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆయన మరణవార్త విన్న ప్రముఖులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.