Ghani Movie Failure: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కోరియన్ కనకరాజు’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. తన కెరీర్‌లో సినిమాల ఎంపిక, విజయాలు-వైఫల్యాలు, ప్రయోగాత్మక చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా కెరీర్ ప్రారంభంలో తాను కథలను ప్రేక్షకుడి కోణంలోనే విన్నానని, అప్పట్లో స్క్రిప్ట్‌లను ఇప్పటిలా లోతుగా విశ్లేషించే అలవాటు లేదని వరుణ్ చెప్పారు. కథలో నిజాయితీ, భావోద్వేగం నచ్చితే వెంటనే ఓకే చెప్పేవాడినని తెలిపారు.
‘ఫిదా’ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కథ చెప్పిన వెంటనే ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో తన అహంకారాన్ని పక్కనబెట్టి ప్రేమ కోసం తిరిగి రావడం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. మంచి ప్రేమకథలో హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రలు సమానంగా బలంగా ఉండాలని, అప్పుడే ప్రేక్షకులు వారి ప్రయాణంతో కనెక్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు. ‘తొలిప్రేమ’ సినిమాతో లవ్ స్టోరీని కొత్త విజువల్ స్టైల్‌లో చూపించాలనే ఆలోచనతో డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి పని చేశామని తెలిపారు. తమన్ సంగీతం, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ, రిలీజ్ సమయం.. అన్నీ కలిసి రావడం ఆ సినిమాకు పెద్ద బలం అయ్యాయని అన్నారు. ‘కంచె’ గురించి మాట్లాడిన వరుణ్.. ఆ సినిమా మొదట తన తండ్రి నాగబాబు విన్నారని, దర్శకుడు క్రిష్ కథ చెప్పిన తర్వాత అది తప్పకుండా చేయాల్సిన సినిమా అని భావించానని చెప్పారు. జార్జియాలో అత్యంత సహజంగా చిత్రీకరణ జరిపామని, సినిమాలోని చాలా యుద్ధ సన్నివేశాలు కూడా వాస్తవికంగానే తెరకెక్కించామని వెల్లడించారు.
ప్రయోగాల విషయానికి వస్తే.. ఒకే తరహా పాత్రల్లో ఇరుక్కుపోవాలని ఎప్పుడూ అనుకోలేదని వరుణ్ స్పష్టం చేశారు. కమల్ హాసన్, చిరంజీవి వంటి నటుల మాదిరిగా విభిన్న పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే కొత్త కథలను ఎంచుకున్నానని చెప్పారు. కొన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయని, మరికొన్ని ఆశించిన ఫలితం ఇవ్వలేదని అంగీకరించారు. ‘గని’ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులో మంచి స్పోర్ట్స్ డ్రామా చేయాలనే నిజాయితీ ప్రయత్నమే ఆ సినిమా అని చెప్పారు. అయితే కోవిడ్ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం కావడం, అదే సమయంలో ఇతర పెద్ద స్పోర్ట్స్ సినిమాలు రావడం ఆ సినిమాపై ప్రభావం చూపిందని తెలిపారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని, మంచి ఆలోచన మాత్రమే కాకుండా సినిమా రిలీజ్‌కి సరైన టైమింగ్ కూడా ఎంతో ముఖ్యమని అప్పుడే అర్థమైందన్నారు. తన ప్రతి సినిమా తనకు ఒక కొత్త పాఠం నేర్పిందని వరుణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్లలో ఏం చూడాలనుకుంటున్నారో ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమైందని, ఇకపై కూడా కొత్త తరహా కథలతో పాటు ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేయాలని ప్రయత్నిస్తానని చెప్పారు.

