Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?

Varanasi , Mahesh Babu]

Varanasi , Mahesh Babu]

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠా్త్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుందా? భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌కే రూ.320 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ మార్కెట్‌లో ‘వారణాసి’ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసినట్టే అని చెబుతున్నారు. ఇప్పటి వరకు జక్కన్న సినిమాలకు ఉన్న భారీ మార్కెట్‌ను కూడా ఈ చిత్రం అధిగమించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.122 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన ‘RRR’ ట్రేడ్ మార్కెట్‌లో దాదాపు రూ.230 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. ఇప్పుడు మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న ‘వారణాసి’ ఏకంగా రూ.320 కోట్ల మార్క్‌ను టచ్ చేయబోతుందనే టాక్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే జరిగితే ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాల రికార్డులను దాటేసి.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా ‘వారణాసి’ నిలిచే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న స్టార్ ఇమేజ్‌కు రాజమౌళి బ్రాండ్ వ్యాల్యూ తోడవడంతో ‘వారణాసి’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ బిజినెస్ టాక్ తెలియజేస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ, స్కేల్, విజువల్స్, ఇంటర్నేషనల్ లొకేషన్ల విషయంలో భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. దీంతో థియేట్రికల్ రైట్స్‌కి కూడా డిమాండ్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే రూ.320 కోట్లకు పైగా బిజినెస్ అంటే.. ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై ఎంతటి నమ్మకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.

‘వారణాసి’ కేవలం మహేష్ – రాజమౌళి కాంబినేషన్ మూవీ మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌గా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దాదాపు రూ.1,400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా ‘వారణాసి’ నిలిచే అవకాశం ఉంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్.కాంచి కథను అందిస్తున్నారు. కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాణంలో భారీ స్థాయిలో తెరకెక్కుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు.. ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు కూడా టాక్ ఉంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ మాత్రం AP-TG థియేట్రికల్ రైట్స్ రూ.320 కోట్లకు పైగా అనే టాక్ చుట్టూనే తిరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ రూ.320 కోట్లకు పైగా బిజినెస్ నిజమైతే మాత్రం.. తెలుగు సినిమా మార్కెట్‌లోనే ఇదొక భారీ రికార్డుగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.