Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!

Udaya Bhanu Panchanama

Udaya Bhanu Panchanama

ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయ భాను నిర్మాతగా మారి ‘పంచనామా’ సిరీస్‌ను రూపొందించారు. క్రైమ్, మిస్టరీ, ఎమోషనల్ డ్రామా అంశాలతో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తొలి ఎపిసోడ్ ప్రత్యేక స్క్రీనింగ్‌తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రబృందం తమ పాత్రలు, కథాంశం, షూటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఈ ఈవెంట్‌లో ఉదయ భాను మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నిర్మాతగా మారాలని దాదాపు 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నానని, ప్రశాంతంగా రెండు గంటలు కూడా నిద్రపోలేనని ఎమోషనల్ అయ్యారు.

పంచనామా సిరీస్‌ తన 15 ఏళ్లుగా మోస్తున్న కలకు ప్రతిరూపమని ఉదయ భాను పేర్కొన్నారు. ‘నిర్మాతగా మారాలని 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా. ఈ 15 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేశాను. మంచి కంటెంట్‌ ఉందని చాలా మందిని కలిసినా పట్టాలెక్కలేదు. వచ్చే వారం.. వచ్చే నెల చేద్దాం అంటూ 15 ఏళ్లు గడిచాయి. ఎందుకు ఇంత ఆలస్యమైందనేది నాకు కూడా తెలియదు. అప్పటి నుంచి నేను ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు. నా కలకు జీ5 ప్రాణం పోసింది. నాపై నమ్మకం ఉంచిన జీ5, అనూ మేడమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎంతో తక్కువ సమయంలోనే అత్యున్నత నాణ్యతతో సిరీస్‌ను రూపొందించేందుకు చిత్రబృందం ఎంతో అంకితభావంతో పనిచేసింది’ అని ఉదయ భాను భావోద్వేగం చెందారు.

‘ఒరిజినల్ కథలోని ప్రధాన అంశాలను అలాగే ఉంచుతూ.. కొత్త కథనంతో పంచనామాను రూపొందించాము. రచయిత నాగేంద్ర, దర్శకుడు మోహన్ శ్రీవత్స, సినిమాటోగ్రాఫర్ సందీప్‌తో పాటు మొత్తం సాంకేతిక, సృజనాత్మక బృందం ఎంతో సహకరించింది. నటీనటులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది’ అని ఉదయ భాను చెప్పారు. ఈ సిరీస్‌లో భరత్ శ్రీనివాస్ జై రామ్ పాత్రలో కనిపించనున్నారు. మేధా రెడ్డి, శివాజీ రాజా, సూర్య శ్రీనివాస్, సృజ, రాధికా ప్రీతి, చరణ్ బాబు, శివ కార్తిక్ దండా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

‘ఒక తలుపు మూసుకుపోతే.. మనమే మన దారిని సృష్టించుకోవాలి’ అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నట్లు ఉదయ భాను చెప్పారు. పంచనామా తమ నిర్మాణ సంస్థ ఉదయ భాను ప్రొడక్షన్స్‌కు కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను నిర్మించడంతో పాటు కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనుకుంటున్నట్లు తెలిపారు. తన 15 ఏళ్ల ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, మనసులో దాచుకున్న ఎన్నో విషయాలు గుర్తుకు రావడంతో భావోద్వేగానికి గురైనట్లు పేర్కొన్నారు. ఎన్ని సార్లు కిందపడ్డానో, అన్నిసార్లు ధైర్యంతో ముందుకు సాగానని.. కిందపడినప్పుడల్లా రెట్టింపు ఉత్సాహంతో నిల్చున్నానన్నారు. అసలైన సపోర్ట్‌ ఆడియన్స్‌ అని చెప్పారు. భావోద్వేగం అనేది బలహీనత కాదని.. అది ఒక బలమని అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సున్నితత్వం చాలా అరుదుగా మారుతోందని, తాను మాత్రం తన స్వభావాన్ని మార్చుకోవడానికి ఇష్టపడటం లేదని ఉదయ భాను తెలిపారు.