Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం

Trivikram

Trivikram

 ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, బంధాలు, స్నేహం గురించి త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ గారితో పనిచేయడం గురించి కూడా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నా ప్రయాణం సినిమాలకు సంబంధించినంత వరకు రచయితగా ‘పవిత్ర బంధం’తో వెంకటేష్ గారి సినిమాతోనే మొదలుపెట్టాను,” అని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “ఒక రకంగా నాతో ఆయన ఓనమాలు దిద్దించారు. ‘పెళ్లి చేసుకుందాం’ టైంలో నన్ను ఎంకరేజ్ చేశారు.”
‘నువ్వు నాకు నచ్చావ్’ కథ చెప్పినప్పుడు వెంకటేష్ రియాక్షన్‌ను త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “నేను కథ చెప్పడం పూర్తయిన వెంటనే, ‘ఈ సినిమా మనం చేస్తున్నాం. ఎవరేం చెప్పినా నువ్వు పట్టించుకోవద్దు’ అని కిందకు వచ్చి రవి కిషోర్ గారికి, విజయ భాస్కర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.” అప్పటి నుంచి తన కెరీర్ వేరే టర్న్ తీసుకుందని త్రివిక్రమ్ అన్నారు.  “కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. మనం సెలెక్ట్ చేసుకోం,” అని త్రివిక్రమ్ చెప్పారు. “కానీ స్నేహితుల్ని మనం ఎంచుకుంటాం. ప్రేమ కోసం అయితే కోరుకుంటాం, వెంటబడతాం, ప్రాణాలు తీసుకునేంతలా ప్రయత్నిస్తాం.” ఈ సినిమాలో చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు వ్యక్తులు తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడిన కష్టాన్ని త్రివిక్రమ్ వివరించారు. “ఒక సామాన్యుడు తెగిస్తే ఎంత దూరం ట్రావెల్ చేయగలడు అనేది ఈ సినిమా కథ,” అని ఆయన చెప్పారు.
మనుషుల మనస్తత్వాల గురించి వివరిస్తూ, త్రివిక్రమ్ ఉద్ధవ గీతను ప్రస్తావించారు. “మనుషుల్లో ఆశ, కోరిక, కలహ ప్రియత్వం ఎక్కువగా ఉంటాయని ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు,” అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాలను ప్రస్తావిస్తూ, మనుషుల మధ్య విభేదాలు ఎలా పెరుగుతున్నాయో త్రివిక్రమ్ వివరించారు. “అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమాజంలో కుటుంబం మాత్రమే మనకి ఇంకా తోడుగా ఉంది,” అని త్రివిక్రమ్ అన్నారు. “కుటుంబ బంధాలను, కుటుంబ విలువలని అంతలా ఇష్టపడతాను. వాటి గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను.” కుటుంబ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ వెంకటేష్ అని త్రివిక్రమ్ కొనియాడారు. “ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వచ్చని ప్రూవ్ చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు. ఫ్యామిలీనే ఆయన మాస్, ఫ్యామిలీనే ఆయన మజిల్, ఫ్యామిలీనే ఆయన బలం.”
శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావిస్తూ, “ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు శ్రీశ్రీ. సో కుటుంబం ఒక పద్మవ్యూహం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందులోకి అభిమన్యులా వెళ్లి బయటికి రావడం తెలియక చనిపోతారా? అర్జునుడిలాగా వెళ్లి గెలిచి విక్టోరియస్‌గా బయటకు వస్తారా అనేదే ఈ సినిమా మనకి చెప్తుంది,” అని త్రివిక్రమ్ వివరించారు. సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ త్రివిక్రమ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రసంగం సినిమాపై అంచనాలను పెంచింది.