‘నార్పప్ప’ సినిమా విడుదలైన నేపథ్యంలో సీనియర్ హీరోలు, వారు చేస్తున్న, ఇటీవల చేసిన పాత్రలు మరోసారి ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చకొచ్చాయి. ‘అసురన్’ మూవీలో యంగ్ హీరో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో ఒదిగిపోయాడు కానీ దాని రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’లో వెంకటేశ్ యంగ్ గెటప్ లో మెప్పించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అందులో యంగ్ నారప్పకు జోడీగా నటించిన అమ్ము అభిరామికి వెంకటేశ్ కు వయసులో ఎంతో వ్యత్యాసం ఉండటం వల్ల ఆ జోడీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో పెళ్ళికెదిగిన కొడుకు ఉన్న నారప్ప పాత్రలో వెంకటేశ్ చక్కగా సెట్ అయ్యాడని అభినందించిన వారికి కొదవ లేదు. సో… విషయం ఏమంటే ఎంత మేకప్ వేసుకుని, గ్రాఫిక్స్ ఉపయోగించి మన సీనియర్ హీరోలు యంగ్ గెటప్ లో కనిపించాలని ప్రయత్నించినా… వారిని ఆ పాత్రలలో చూడటానికి వీక్షకులకు మనసొప్పడం లేదు.
చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ఖైదీ నెం. 150’లో కాజల్ సరసన ఫర్వాలేదనిపించారు. అది రీ-ఎంట్రీ మూవీ కావడంతో జనం ఆ జోడీ గురించి పెద్దంతగా పట్టించుకోలేదు. అదే తర్వాత సినిమా ‘సైరా’లో తమన్నా పక్కన చిరంజీవి మరీ వయసున్న వాడిగా కనిపించారంటూ కొందరు పెదవి విరిచారు. ఇదే విషయం ‘మన్మథుడు -2’లో నాగార్జున విషయంలోనూ జరిగింది. కథానుగుణంగా కొంత ఏజ్ గ్యాప్ ఉన్నట్టు చూపించినా… ఆ పాత్రలో నాగ్ మెప్పించలేకపోయారు. బాలకృష్ణకూ ఇది వర్తించే ఆస్కారం ఉంది. గతంలో ఎన్టీయార్, ఏయన్నార్ వంటి వాళ్ళు తమ వయసులో సగం ఉన్న హీరోయిన్లతో జోడీ కట్టినా… ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ… ఇప్పుడు రోజులు మారిపోయాయి. అందువల్ల మన సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేసుకోవడం ఉత్తమం అనిపిస్తోంది. ఆ రకంగా చూసినప్పుడు వెంకటేశ్ నటించిన ‘దృశ్యం -2’ లోని పాత్ర ఆయనకు నూటికి నూరు శాతం సెట్ అయ్యేదే! సో… మిగిలిన సీనియర్ హీరోలు కూడా అదే బాటలో పయనిస్తే బెటర్!