Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!

Tollywood

Tollywood

Tollywood Release Dates: భారీ బడ్జెట్, స్టార్ హీరోల కటౌట్లు, విజువల్ ఎఫెక్ట్స్ హంగామా.. ఇదంతా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెలుగుతున్న ఒకవైపు చిత్రమైతే, ఆ వెలుగుల వెనుక చిన్న నిర్మాతల నిట్టూర్పులు, ఎన్నో కలలతో ప్రేక్షకులను పలకరించాలనే ఆశలతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైన, ఏళ్ల కొద్ది కాలం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినా నమ్మిన కథ కోసం.. తన సినిమాని నలుగురి ముందుకు తీసుకురావడం కోసం ఎందరో చిన్న చిత్రాల దర్శకులు పడే తాపత్రాయం మరో వైపు ఉంది. నిజానికి వీళ్లవైపు ఉంది కన్నీళ్లు నిండిన చీకటి కోణం. ముందస్తు ప్రణాళిక లేకుండా రిలీజ్ డేట్లను బ్లాక్ చేయడం, తీరా చివరి నిమిషంలో “ఆ పని పూర్తి కాలేదు”, “పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైంది” అంటూ చేతులెత్తేసి వెనక్కి తగ్గడం ఇటీవల పెద్ద ప్రాజెక్టులకు పరిపాటిగా మారింది. ఈ ‘డేట్ల సర్కస్’లో థియేటర్లు దొరక్క, పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక నిలువునా బలైపోతున్నది మాత్రం చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలే.

సాధారణంగా చిన్న నిర్మాతలు రెక్కల కష్టంపై, వడ్డీలకు అప్పులు తెచ్చి కథను నమ్ముకుని సినిమాలు తీస్తారు. ఏదైనా ఒక స్టార్ హీరో సినిమా పండగ తేదీని లాక్ చేసుకుంటే.. “వారితో పోటీ మనకెందుకు, థియేటర్లు దక్కవు” అన్న భయంతో ఆ డేట్‌కి చిన్న చిత్రాలు ఖాళీ చేసి పక్కకు తప్పుకుంటాయి. తీరా ఆ టైంకి రావాల్సిన పెద్ద సినిమా అర్ధాంతరంగా వాయిదా పడుతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో పరిపాటిగా మారిపోయింది. దీంతో అటు థియేటర్లు ఖాళీగా ఉండి ఎగ్జిబిటర్లు నష్టపోవడంతో పాటు, ఇటు పండగ టైంని సరిగ్గా వాడుకుందామంటే చిన్న చిత్రాలకూ ఆ డేట్లు కలిసిరావడం లేదు. సరే ఏదో ఒక వీక్ చూసుకుని చిన్న ప్రాజెక్టులు ప్రమోషన్లు మొదలుపెట్టి థియేటర్లను సర్దుబాటు చేసుకుంటే.. వాయిదా పడిన ఆ పెద్ద సినిమాలు సరిగ్గా అదే డేట్‌పై వచ్చి ల్యాండ్ అవుతున్నాయి. దీంతో థియేటర్స్ వద్ద ఒక్కసారిగా సమీకరణాలన్నీ తలకిందులవుతాయి. ఉన్న స్క్రీన్లన్నీ మళ్లీ పెద్దోళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో చిన్న చిత్రాలు వేసిన పబ్లిసిటీ పోస్టర్లు, డిజిటల్ ప్రమోషన్ల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరై.. నిర్మాతలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో రావడంతో, బలమైన కంటెంట్ ఉన్నా, సరైన థియేటర్స్ లేక, ఎలాంటి ప్రచారం కూడా జనాల్లోకి వెళ్లక చిన్న చిత్రాల పరిస్థితి ఆగం అవుతుంది.

ఈ రిలీజ్ డేట్ల గందరగోళానికి ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ముందుగా ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్స్‌లో రిలీజ్ చేయాల్సి ఉంది. తీరా రిలీజ్ టైం దగ్గర పడుతున్న టైంలో పనులు పూర్తి కాలేదంటూ అక్టోబర్ 9కి పోస్ట్‌పోన్ చేశారు. నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అవాల్సిన టైంలో ఈ రోజు నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీటింగ్ పెట్టి ఆదర్శకుటుంబం సినిమా అక్టోబర్ 9 కి రిలీజ్ కావడం లేదని చెప్పారు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది దానిపై ఆయన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ చేయకపోయినా సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 కి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం అవుతుంది. ఈ పోస్ట్ పోన్ వ్యవహారం బయటికి రాగానే అక్టోబర్ నెలాఖరును లక్ష్యంగా చేసుకుని థియేటర్లలోకి రావాల్సిన లో-బడ్జెట్ సినిమాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తుంది. గతంలో ‘పెద్ది’, ‘టాక్సిక్’, ‘ది ప్యారడైజ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇలాగే ముందస్తు తేదీలను ప్రకటించి, ఆ తర్వాత వేరే తేదీలకు మారిపోయి బాక్సాఫీస్ క్యాలెండర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

కథాబలంతో, సరికొత్త ప్రయోగాలతో తెరకెక్కే ఎన్నో చిన్న సినిమాలకు సరైన రిలీజ్ డేట్ లభించక, తగినన్ని థియేటర్లు కేటాయించక ఎందరో ప్రతిభావంతులైన యువ దర్శకులు, చిన్న నిర్మాతలు తెరమరుగైపోతున్నారు. భారీ బడ్జెట్, సోషల్ మీడియా హైప్ మాత్రమే గీటురాయిగా మారిన నేటి కాలంలో, రిలీజ్ తేదీలపై స్పష్టమైన రూల్స్ లేకపోవడం చిత్ర పరిశ్రమకే గొడ్డలిపెట్టుగా మారిందనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాల తేదీల ప్రకటన, వాయిదాల వ్యవహారాలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ లేదా ఫిల్మ్ ఛాంబర్ ఒక పకడ్బందీ నిబంధనను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందనే బలమైన వాదన వినిపిస్తుంది. అలా జరగనంత కాలం పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్లుగా.. పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల దెబ్బకు చిన్న సినిమాల అస్తిత్వమే గాల్లో దీపంగా మారక తప్పదనే పరిస్థితి కొనసాగుతునే ఉంటుందని అంటున్నారు.