The Paradise OTT: ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

The Paradise Ott Release Date

The Paradise Ott Release Date

The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ హైప్ నెలకొంది. ఓ జాతి మనుగడ కోసం సాగే పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘ది ప్యారడైజ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈనెల 22 నుంచే ‘ది ప్యారడైజ్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. ఇక థియేటర్లలో చూసిన వెర్షన్‌నే ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారా లేక రన్‌టైమ్ వల్ల కట్ చేసిన సీన్లను ఏమైనా అదనంగా యాడ్ చేసి ‘ఎక్స్‌టెండెడ్ కట్’ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా చేయగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో మెప్పించారు. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. థియేటర్లలో చూడటం మిస్సయిన వారు ఈనెల 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా చూసేయొచ్చు.

ది ప్యారడైజ్ కథ:

సినిమా అంతా 80ల కాలంలో జరుగుతూ ఉంటుంది. సికింద్రాబాద్ దగ్గర ఉన్న పారడైజ్ ప్రాంతంలో ఒక గుర్తింపు కూడా లేని తెగ సవారీలు. ఆ తెగ గుర్తింపు కోసం పాటుపడుతున్న సమ్మక్క (సోనాలి కులకర్ణి) కొడుకే జడల్ (నాని). చిన్నప్పుడే ఒక సంఘటన వల్ల అతనికి తల్లి అంటే అసహ్యం కలుగుతుంది. దీంతో ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా, ఆ పోరాటం చేయకుండా దొంగతనాలు చేసి వ్యవస్థకు ఎదురు వెళితే తప్ప గుర్తింపు దక్కదని భావిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని, కనీసం మనుషుల్లా కూడా సవారీలను ట్రీట్ చేయకుండా ఉన్న శిఖంజ మాలిక్ (మోహన్ బాబు) ఆధిపత్యాన్ని సమ్మక్క ప్రశ్నించగలిగిందా? అసలు సమ్మక్కను కొడుకు ఎందుకు అసహ్యించుకున్నాడు? తన కొడుకు చోటా మాలిక్‌ను తన వారసుడిగా ప్రకటించిన మాలిక్, ఆ ప్రాంతాన్ని అసలు ఎందుకు గుర్తింపు లేని ప్రాంతంగా మార్చేయాలనుకున్నాడు? చివరికి ఏం జరిగింది? అలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.